విజయాలు.. వైఫల్యాలు

విజయాలు.. వైఫల్యాలు - Sakshi


ఇలంబరితి ఏడాది పాలన

♦ గాడిలో పడిన రెవెన్యూ శాఖ

♦ మిషన్ కాకతీయ సక్సెస్

♦ గ్రీవెన్స్‌సెల్‌కు ప్రాధాన్యత

♦ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. దళితులకు భూ పంపిణీలో వెనుకబాటు

 

 ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఏడాది పాలనలో తన మార్క్ చూపెట్టారు. బాధ్యతలు చేపట్టిన రోజే తాను పేద కుటుంబం నుంచి వచ్చానని.. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఏఎస్ నయ్యా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా...అవినీతిని నిర్మూలిస్తా ..ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు...అన్నట్టుగానే తన ప్రభావం చూపారు. కొన్ని అంశాలను ప్రభావితం చేయలేకపోయూరనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల విజయవంతానికి కృషి చేశారు. మరికొన్ని పథకాల అమలులో వైఫల్యం చెందారు. ఆయన ఏడాదిపాలన మొదటి ఆరు నెలలు పరుగులు పెట్టగా మరో ఆరు నెలలు నత్తనడకన సాగింది. శుక్రవారానికి జిల్లా కలెక్టర్‌గా ఇలంబరితి బాధ్యతలు చేపట్టి ఏడాది అయిన సందర్భంగా ప్రత్యేక కథనం.



 పైరవీలకు తావులేకుండా..

 జిల్లా రెవెన్యూ శాఖను గాడిలో పెట్టిన ఘనత ఇలంబరితికే దక్కింది. ఇల్లు చక్కదిద్ది ఊరును చక్కదిద్దాలనే నానుడిని కార్యరూపం దాల్చారు. రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి తహశీల్దార్ వరకు బదిలీలు చేశారు. ఎలాంటి రాజకీయ పైరవీలకు తావు లేకుండా పాలనను గాడిలో పెట్టారు. అలాగే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. జిల్లా కేంద్రానికి స్థానిక సమస్యలపై ఫిర్యాదులు రావడంతో మండల, డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అక్కడి కక్కడే సమస్యలను పరిష్కారించేలా చొరవచూపారు.



సమస్య పరిష్కారం అవుతుందో..లేదో.. స్పష్టంగా రాత పూర్వకంగా సమాధానం తెలిపేలా ప్రణాళికలు చేశారు. గ్రీవెన్స్‌లో అధికంగా భూ సమస్యలే ఉండటంతో  రెవెన్యూలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టి, భూ రికార్డులన్ని ఆన్‌లైన్ చేరుుంచారు. అనేక ఏళ్ళగా పెండింగ్‌లో ఉన్న జమాబందీని గాడిలోకి తెచ్చారు. దీంతో రెవెన్యూ ఆదాయం పెరగడంతో పాటు రెవెన్యూలో అక్రమాలకు అడ్డుకట్టపడింది.



 పాలనపై పట్టు..

 అధికార యంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేసి పాలనపై పట్టు సాధించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకంపై పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని నిమగ్నం చేశారు. పలు శాఖలలో అకస్మిక తనిఖీలు నిర్వహించి సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో అన్ని శాఖలలో పాలనపై తన దైన శైలిలో ముద్ర వేశారు. గత అనుభవాల దృష్ట్యా ప్రతి పథకం అమలుకు ముందస్తు ప్రణాళికలతో విజయవంతానికి కృషిచేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబసర్వే, మన ఊరు-మన ప్రణాళిక, కాకతీయ మిషన్, తెలంగాణ సంబురాలు, హరితహారం, గోదావరి పుష్కరాలు విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించారు.



ఉపాధిహామీ పథకం కూలీలకు అన్‌లైన్‌లో జీతాలు చెల్లించేలా ప్రత్యేక చొరవ తీసుకుని బ్యాంక్ ఖాతాలు తె రి పించారు. రైతులకు రుణమాఫీ అమలులో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించి ఎలాంటి అవకతవకలు లేకుండా మంచిపేరు తెచ్చుకున్నారు. అలాగే జిల్లాలో వాటర్ గ్రిడ్ పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు తాగు నీటి సమస్య లేకుండా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో మొత్తం 903 చెరువులకు గాను ఇప్పటికే 520 చెరువుల పునరుద్ధరణ చేశారు. రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు.



తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత భూపంపిణీ అమలులో జిల్లా వెనుబాటుకు గురైంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు.ఎస్సీ,ఎస్టీలకు రుణాల మంజూరులో బ్యాంకర్లపై అజమాయిషీ లేకపోవడంతో పలుకుబడి కలిగిన వారికి మాత్రమే పథకం చేరువైంది. జిల్లాలో అత్యధికంగా ఉన్న గిరిజనుల సమస్యలపై దృష్టి సారించిన దాఖ లాలు లేవు. జిల్లా వ్యవసాయాధారితమైనప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి.

 

 రాజకీయ నేతలతో సఖ్యత

 జిల్లా రాజకీయంగా చైతన్యవంత మైంది. పలు పార్టీలు ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహించడం, సమస్యలను అధికారులకు వివరించడం పరిపాటి. అయితే బదిలీల విషయంలో రాజకీయ నాయకులు చెప్పిందే వేదంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే అన్ని పార్టీల నాయకులతో సఖ్యతగా ఉంటూ సమస్యలను ఓపికగా విని వారి మన్ననలు సైతం పొందారు. బదిలీల్లో రాజకీయ నేతలు పైరవీలు చేసినా సున్నితంగా తిరస్కరించి చాకచక్యంగా వ్యవహరించారు. విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చొరవచూపి, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ప్రసంశలు పొందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top