సమన్వయంతో అసెంబ్లీ సమావేశాలు

సమన్వయంతో అసెంబ్లీ సమావేశాలు - Sakshi


హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరుగుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. ఈనెల 7న ఇరు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో బుధవారం తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి కార్యాలయంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, రెండు రాష్ట్రాల శాసన మండళ్ల చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, అసెంబ్లీ అధికారులు సమావేశమై చర్చించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల మంత్రులు గేట్-1 నుంచి, ఎమ్మెల్యేలు గేట్-2 నుంచి  అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఒకే సమయంలో రెండు అసెంబ్లీలు సమావేశమవుతున్నందున లాబీ ల్లోకి విజిటర్ పాస్‌లను రద్దు చేశారు. పరిస్థితులను పరిశీలించి, ఇబ్బంది లేదనుకుంటేనే గ్యాలరీ పాసులు జారీ చేయాలని నిర్ణయించారు. మంత్రుల వాహనాల పార్కింగ్‌ను పాత విధానంలోనే కొనసాగించగా, ఎమ్మెల్యేల వాహనాల పార్కింగ్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేశారు.



రోజువారీ ఇబ్బందులను అధిగమించేం దుకు రెండు రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు గేట్ల వద్ద ఎస్పీ స్థాయి అధికారులకు డ్యూటీలు వేయనున్నారు. సమావేశాలు ప్రారంభం కానిదే, ఏఏ సమస్యలు వస్తాయో ఊహించడం కష్టం కాబట్టి, మూడు రోజుల పాటు సమావేశాలు జరిగాక, ఉత్పన్నమయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని మరోసారి స్పీకర్లు భేటీ కావాలని అంగీకారానికి వచ్చారు.  ఒకవేళ సాయంత్రం పూటా సమావేశాలు ఉంటే తర్వాత మాట్లాడుకోవాలని, రెండు సభలు ఒకే సమయంలో ప్రారంభం కాకుండా, ముగియకుండా కనీసం అరగంట తేడా ఉండేలా చూసుకోవాలన్న చర్చ జరిగినట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.



శాసనమండలిలో ఒకే మీడియా పాయిం ట్ ఉన్నందున, దానినే రెండు మండళ్ల సభ్యు లు వినియోగించుకోవాలని సూచించి నా, రెండో పాయింట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. భేటీ ముగిశాక ఇరు రాష్ట్రాల స్పీకర్లు వేర్వేరుగా తమ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ పోలీసు అధికారులు, అసెంబ్లీ బందోబస్తుకు వచ్చే సిబ్బంది సమన్వయంతో పనిచేసేలా చూడాలని స్పీకర్ మధుసూదనాచారి ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top