సీఎం సాబ్ జరదేఖో..

సీఎం సాబ్ జరదేఖో.. - Sakshi


వేసవి వచ్చింది.. అప్పుడే జిల్లాలో క‘న్నీటి’ కష్టాలు మొదలయ్యాయి. కడివెడు నీటి కోసం మైళ్ల దూరం పరుగుపెడుతున్నారు. మరోవైపు జిల్లాలోని ప్రాజెక్టు పనులు పడకేశాయి. రైతులకు సాగునీరందించని దయనీయ పరిస్థితి ఉంది. వీటికి తోడు జిల్లా ప్రజలు నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావు మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈసారైనా జిల్లాపై హామీల వర్షం కురిపిస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.  

 

నేడు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక

- జైపూర్ విద్యుత్ ప్లాంట్‌లో అదనంగా 600 మెగావాట్ల ఉత్పత్తికి శంకుస్థాపన

- సమస్యల పరిష్కారానికి జిల్లా ప్రజల వేడుకోలు


జైపూర్ : రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సింగరేణి విద్యుత్ ప్రాజెక్టులో మూడో యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జైపూర్ మండల కేంద్ర సమీపంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1200మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రూ.3,570 కోట్లతో మరో 600 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మూడో యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు తెలిపారు.



ఈ సందర్భంగా సోమవారం సీఎం పర్యటన ఏర్పాట్లను విప్ ఓదెలు, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు పరిశీలించారు. సింగరేణి అధికారులు హెలీప్యాడ్, పైలాన్ (శిలాఫలకం) సిద్ధం చేశారు. అనంతరం విప్ ఓదెలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత ఉన్న నేపథ్యంలో 1200 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టును మరో 600 మెగా వాట్లకు పెంచడం జరుగుతుందన్నారు.

 

సీఎం పర్యటన షెడ్యూల్

ఉదయం 10.00 గంటలు : మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని వ్యవసాయం క్షేత్రం నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరుతారు.

10.45 : జైపూర్ మండల కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ సింగరేణి నిర్మిస్తున్న 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక ప్లాంటులో అదనంగా 600 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

12.30 : తిరిగి జగదేవ్‌పూర్ వెళ్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top