Alexa
YSR
‘సంక్షేమ పథకాలతో ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో ఉండిపోతాం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణకథ

‘రాష్ట్రం ఊరుకోదు, యుద్ధం కొనసాగుతుంది’

Sakshi | Updated: June 19, 2017 06:39 (IST)
‘రాష్ట్రం ఊరుకోదు, యుద్ధం కొనసాగుతుంది’ వీడియోకి క్లిక్ చేయండి

► ముస్లిం బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాను. బిల్లును రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ ఆమోదించిన తర్వాత మీకు పంపుతానని ప్రధాని మోదీతో ఢిల్లీలో సమావేశమైనప్పుడు తెలిపాను. పంపండి.. సానుకూలంగా పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మనం మళ్లీ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో బిల్లును తీసుకువద్దాం. లేకుంటే తెలంగాణ రాష్ట్రం మౌనంగా ఊరుకోదు, యుద్ధం కొనసాగుతుంది (జంగ్‌ జారీ రహేగీ)’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నామినేటెడ్‌ పదవులతో సహా అన్ని చోట్లా ముస్లింలకు 10% రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీ సీట్లు, 5 కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు, ఓ వర్సిటీ వీసీ పదవి, హైదరాబాద్, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ల పదవులను ముస్లింలకు కేటాయించామని, ఈఆర్సీ చైర్మన్‌గా ఇస్మాయిల్‌ అలీఖాన్‌ను నియమించామన్నారు. రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఉర్దూలో ప్రసంగిస్తూ రాష్ట్రంలోని ముస్లింలందరికీ ముందస్తుగా రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

204 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు
తాము రాష్ట్రంలో 204 మైనారిటీల రెసిడెన్షియల్‌ పాఠశాలలను తెరిచామని, 2022లోగా 1.33 లక్షల మంది విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకుంటారని వెల్లడించారు. కాన్వెంట్‌ స్కూళ్ల తరహాలో ఒక్కో విద్యార్థి చదువుకి ఏటా రూ.1.25 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందని తెలిపారు.

ముస్లిం అభ్యర్థులకు సివిల్స్‌ శిక్షణ
విద్య, ఇతర అంశాల్లో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ముస్లింలకు రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని కేసీఆర్‌ వివరించారు. విదేశీ విద్య అభ్యసించే ముస్లిం, క్రైస్తవ, ఇతర మైనారిటీ వర్గాల విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఉపకార వేతనం మంజూరు చేస్తున్నామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ పోటీ పరీక్షల కోసం 100 మంది ముస్లిం అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, ఇందుకోసం హైదరాబాద్‌లో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రభుత్వానికి సూచనలివ్వండి..
ముస్లింల అభివృద్ధికి అమలు చేయాల్సిన కార్యక్రమాలను ముస్లిం మతపెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని, అవసరమైతే తనకు లేఖలు రాయాలని, ప్రత్యేకంగా వచ్చి కలవాలని కేసీఆర్‌ కోరారు.  ఇఫ్తార్‌ విందు అనంతరం ముస్లిం సోదరులు అక్కడే మఘ్‌రిబ్‌ నమాజ్‌ చేశారు. ఉపవాస దీక్ష విరమణ కోసం పండ్లు, ఫలాలు, భోజనం కోసం హలీమ్, చికెన్‌ బిర్యానీ.. తదితర వంటకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్‌ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, ఏకే ఖాన్, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల ఓవరాక్షన్‌
సీఎం ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు ఆహ్వానాలు అందుకున్న వందల మందికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం రాకకు 10 నిమిషాలు ముందే ఎల్బీ స్టేడియానికి వెళ్లే దారుల్ని పోలీసులు మూసేసి ట్రాఫిక్‌ను ఆపివేశారు. కేసీఆర్‌ ఎల్బీ స్టేడియానికి చేరుకోగా, వెంటనే పోలీసులు గేట్లు మూసేసి, అతిథులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వర్షంలో చిక్కుకున్న ఆహ్వానితులు ప్రభుత్వం నుంచి అందుకున్న పాస్‌లను చూపించినా పోలీసులు అనుమతించలేదు. పోలీసుల ఓవరాక్షన్‌ కారణంగా చాలా మంది మీడి యా ప్రతినిధులు కూడా వర్షంలో డీ–బ్లాక్‌ గేట్‌ వద్ద వేచి చూశారు. ప్రభుత్వం జారీ చేసిన మీడియా పాస్‌ను చూపించి లోపలికి వెళ్లేందుకు మీడియా ప్రతినిధులు అనుమతి కోరగా, ‘లోపల స్థలం లేదు.. ఎవరినీ లోపలికి పంపవద్దని మా డీసీపీ ఆదేశించారు’ అని అక్కడ బందోబస్తులో ఉన్న ఎస్‌ఐ అడ్డుకున్నారు. చివరికి కొద్దిసేపటి తర్వాత లోనికి ప్రవేశించినా.. సీఎం ప్రసంగంతో పాటు ఇఫ్తార్‌ సమయం కూడా ముగిసిపోయింది.
 


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

జల్దీ జాబ్స్‌కు దారేది?

Sakshi Post

Second Edition Of RFYS Football Competition Begins 

RFYS chairperson Nita Ambani, a member of the International Olympic Committee (IOC), cheered on by h ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC