కేసీఆర్‌ చూపు.. నల్లగొండ వైపు!

కేసీఆర్‌ చూపు.. నల్లగొండ వైపు! - Sakshi


నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగే యోచన?

సన్నిహితుల వద్ద అంతరంగాన్ని వెలిబుచ్చి ఆరా తీసిన సీఎం




సాక్షి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లా వైపు దృష్టి సారించారా..? అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహం రచించారా? అందుకోసం వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారా..? తద్వారా ఆ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలకు చెక్‌ పెట్టవచ్చనీ యోచిస్తున్నారా..!?.. నాలుగైదు రోజులుగా నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న అంశమిది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ నల్లగొండ జిల్లా నుంచి బరిలోకి దిగాలనే యోచిస్తున్నారని.. యాదృచ్ఛికంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారని అంటున్నారు.



ఓ మిత్రుడి నుంచి ఆరా..!

సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురితో రాజకీయంగా, వ్యక్తిగతంగా సంబంధాలున్నాయి. అలాంటి వారిలోని ఓ మిత్రుడు ఇటీవల కేసీఆర్‌ను కలిశారని.. ఆ సమయంలోనే నల్లగొండ జిల్లా నుంచి పోటీ విషయాన్ని కేసీఆర్‌ చూచాయగా వెల్లడించారని తెలుస్తోంది. ఆ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు, ప్రజల్లో తన పాలనపై ఉన్న అభిప్రాయం, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి విషయాలపైనా ఆ మిత్రుడి అభిప్రాయాన్నీ తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా.. ‘‘నేను ఈసారి ఎలాగూ రెండు చోట్ల పోటీ చేస్తాను. నల్లగొండ జిల్లా నుంచి చేద్దామనుకుంటున్నా.. ఎలా ఉంటుంది.. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిపిస్తారా..’’అని ఆరా తీసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నల్లగొండపై దృష్టి సారించినట్టు అర్థమవుతోందని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది.



ఈ జిల్లా నుంచే ఎందుకు?

నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేయాలన్న కేసీఆర్‌ యోచన వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నల్లగొండ జిల్లాలో తొలినుంచీ కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలకు పట్టు ఉంది. తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం, రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. అటు కాంగ్రెస్‌ కూడా దీటైన ఫలితాలనే సాధించింది. ఐదుగురు కాంగ్రెస్‌ అభ్యర్థులు, కాంగ్రెస్‌ మద్దతిచ్చిన సీపీఐ అభ్యర్థి ఒకరు గెలుపొందారు.



ఇందులో కాంగ్రెస్‌ దిగ్గజాలైన కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా ఉన్నారు. జానారెడ్డి సీఎల్పీ నాయకుడిగా, కోమటిరెడ్డి సీఎల్పీ ఉపనాయకుడిగా, ఉత్తమ్‌ పీసీసీ అధ్యక్షుడిగా కీలక పదవుల్లో ఉన్నారు. వీలున్నప్పుడల్లా ఈ ముగ్గురు అధికార టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కాంగ్రెస్‌ కేడర్‌లోనూ ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలో 2015 డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించినా.. నల్లగొండ జిల్లాలో మాత్రం ఓడిపోయింది. ఇది టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు కేసీఆర్‌ను కూడా ఆలోచనలో పడేసింది.



బలోపేతం చేసేందుకు..

ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత లేకపోయినా.. కొంతమేర స్థానిక నాయకత్వం, ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత వస్తోంది. కేసీఆర్‌ చేయించిన సర్వేల్లోనే ఈ విషయం వెల్లడైంది. అందులోనూ పాత నల్లగొండ జిల్లా పరిధిలో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా చోట్ల టీఆర్‌ఎస్‌ నేతల గ్రాఫ్‌ పడిపోయినట్లు తేలింది. మరోవైపు కాంగ్రెస్‌ నేతల గ్రాఫ్‌ మెరుగుపడింది. ఇక పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గ్రూపు గొడవలు, సరైన నాయకత్వం లేకపోవడం వంటి సమస్యలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో పార్టీ బలాన్ని, ఊపును పెంచేందుకు వ్యూహం పన్నుతు న్నారని, అందులో భాగంగా అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నా రని తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top