అంగన్‌వాడి సిబ్బందికి సీఎం వరాలు


సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడి కార్యకర్తలు, సహాయకుల వేతనాలు పెంచుతామని, పెంచిన జీతాన్ని మార్చి నుంచే అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. అర్హత ఆధారంగా అంగన్‌వాడి కార్యకర్తలతోనే సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. కార్యకర్తలు, సహాయకుల విద్యార్హతలను బట్టి, వారి సర్వీసును పరిగణలోకి తీసుకుని ఇతర ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో వారిని భాగస్వాములను చేస్తామని, పిల్లల ఆలనా పాలనాతో పాటు చిన్నతనంలో విద్యాబోధన ఎలా చేయాలనే విషయంలో అంగన్‌వాడి కార్యకర్తలకు ఉన్న అనుభవాన్ని ఉపయోగిస్తామని తెలిపారు.


వివిధ జిల్లాలనుంచి వచ్చిన అంగన్‌వాడి కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్‌వైజర్లు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారితో దాదాపు మూడు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని అంశాలపై వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ, జీతభత్యాలు, ఆరోగ్యలక్ష్మి అమలు తదితరఅంశాలపై సీఎం పలు సూచనలు చేశారు. అంగన్‌వాడి సిబ్బందికి ప్రతినె లా వేతనం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

 అంగన్‌వాడి సిబ్బందికి జీవితబీమా

 అంగన్‌వాడి సిబ్బందికి జీవితబీమా సౌకర్యం కల్పిస్తామని, కార్యకర్తలు, హెల్పర్ల అర్హతను బట్టి ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డులు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంగన్‌వాడి సిబ్బంది నియామకాల్లో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, ఇతరత్రా వేధింపులకు పాల్పడినా తనకు నేరుగా సమాచారం అందించాలన్నారు. అంగన్‌వాడి కేంద్రాలకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు విధిగా మంచినీళ్లు సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉప కార్యదర్శి ప్రశాంతి, ఐసీడీఎస్ డెరైక్టర్ విజయేంద్ర, సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దనరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, ఐసీడీఎస్ జేడీ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

 

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top