సీఎం వస్తున్నారు..

సీఎం వస్తున్నారు.. - Sakshi


9,10 తేదీల్లో కేసీఆర్ పర్యటన

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడి


 

హన్మకొండ : వరంగల్ నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు రోజులపాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను కడియం శ్రీహరి సోమవారం చూచాయగా తెలిపారు. హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జూలై 9న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరానికి వచ్చే అవకాశం ఉంది. వరంగల్‌లో నెలకొల్పనున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్‌కు 10న సీఎం శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్మించనున్న మహిళా డిగ్రీ కాలేజీకి సైతం సీఎం శంకుస్థాపన చేస్తారు’ అంటూ సీఎం పర్యటన వివరాలు వెల్లడించారు. అంతేకాక జిల్లాకు సైనిక్ స్కూల్ సైతం మంజూరైంద ంటూ డిప్యూటీ సీఎం తెలిపారు. రాబోయే రెండు మూడు నెలల్లో సైనిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామంటూ తెలిపారు. వరంగల్‌లో నెలకొల్పిన కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీని ఎక్కడికీ తరలించడం లేదని శ్రీహరి హామీ ఇచ్చారు. వరంగల్ నుంచే హెల్త్ వర్సిటీ కార్యకలాపాలు జరుగుతాయని ఆయన చెప్పారు.



 రెండు రోజులపాటు.. హారితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జిల్లాకు వస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. కేయూ క్యాంపస్‌లో జరిగే హరితహారం కార్యక్రమంలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పర్యటనలోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వరంగల్ బ్రాంచ్, మహిళా డిగ్రీ కళాశాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు హంటర్ రోడ్డులో ఉన్న స్టేట్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. సీఎం పర్యటనకు సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. 2015 జనవరిలో రెండు రోజుల పర్యటనకు సీఎం కేసీఆర్ వరంగల్ వచ్చారు. ఆ తర్వాత అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వరుసగా నాలుగు రోజులపాటు వరంగల్‌లోనే ఉన్నారు. ఈ సందర్భంగా మురికి వాడల్లో పర్యటించిన సీఎం అనూహ్యంగా తొమ్మిది మురికి వాడల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కేవలం రెండు కాలనీల్లోనే ఇంటి నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. మిగిలిన కాలనీల్లో ఇంటి నిర్మాణాలపై స్తబ్దత నెలకొంది. ఈసారి జూలై 9,10 తేదీల్లో సీఎం నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనుల్లో కదలిక వచ్చేందుకు ఆస్కారం ఉంది. మందకకొడిగా సాగుతున్న ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు పనులు వేగం పుంజుకోనున్నాయి.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top