నేడు జిల్లాకు సీఎం కేసీఆర్

నేడు జిల్లాకు సీఎం కేసీఆర్ - Sakshi


నేడు జిల్లాకు సీఎంకేసీఆర్

రేపు ‘కంతనపల్లి, దేవాదుల’ ఏరియల్ సర్వే

 


శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు కరీంనగర్‌ను దాటి వరంగల్ జిల్లాకు రావడం ఇబ్బందిగానే ఉంది. సాంకేతిక లోపాలతో దేవాదులను సామర్థ్యం మేరకు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఈ రెండు ప్రాజెక్టుల ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే కంతనపల్లి ఒక్కటే మార్గం. అలాంటి బృహత్తర ప్రాజెక్ట్ నిర్మాణానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నారుు. సీఎం కేసీఆర్ ఆదివారం కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేస్తుండడంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. కంతన        పల్లిపై కదలిక తెస్తారని.. దేవాదుల, ఎస్సారెస్పీ దిశాదశ మారుస్తారని.. తాగు,  సాగు నీటి అవసరాలు తీరుస్తారని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, వరంగల్   

 

వరంగల్:  గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన దేవాదుల(జువ్వాడి చొక్కారావు గోదావరి ఎత్తిపోతల పథకం) నిర్మాణం ప్రారంభించి పుష్కరం దాటినా ఎన్నటికి పూర్తయ్యేనో తేలియడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతోనైనా ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందనేది జిల్లావాసుల ఆశ. వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 30 మండలాల్లో 6.21 లక్షల ఎకరాలకు 38.18 టీఎంసీల నీరందించేందుకు 1999లోనే కేంద్ర జల వనరుల సంఘం సభ్యుడు విద్యాసాగర్‌రావు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్మాణం చేయలేమంటూ ఏళ్లపాటు పట్టించుకోని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం... చివరకు 2003లో ఫైల్‌ను బయటకు తీసింది. బాబు 2003 జూన్‌లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క రూపాయి నిధులివ్వలేదు. 



నిధుల్లేక భూ సేకరణ ఆగింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కడియం శ్రీహరి ఉన్నప్పుడే రూ.783 కోట్లతో టెండర్లు పూర్తరుునా నిధులు విడుదల కాలేదు. రూ.930 కోట్లతో దేవాదుల ఫేజ్-1 ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. టెండర్లు పిలిచే సమయానికి రూ.783 కోట్లకు తగ్గించారు. ఈ ధరకే చంద్రకు సన్నిహితంగా ఉండే ఓ సంస్థకు టెండర్లు అప్పగించారు.  2004 జనవరిలో పనులు చేసేందుకు కంపెనీ.. అగ్రిమెంట్ చేసుకుంది. తర్వాత తొలిసారిగా దేవాదుల ప్రాజెక్టుకు రూ.93.50 కోట్లు మాత్ర మే విడుదల చేశారు. తొలి విడతలో 5.18 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేందుకు రూ.930 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం 2006 జులై 7న సాంకేతిక అనుమతి మంజూ రు ఇస్తూ టెండర్లు పిలిచింది. ప్రాజెక్టుతో మొత్తం 1.24 లక్షల ఎకరాల బీడుభూమిని సాగులోకి తీసుకురానున్నారు. గంగారం ఇంటెక్ వెల్ నుంచి భీంఘన్‌పూర్, అక్కడ నుంచి పులుకుర్తి, ధర్మసాగర్ రిజర్వాయరు నిర్మాణం చేపట్టనున్నట్లు తొలివిడతలో రూపొందించారు. మొదటి, రెండో విడతల్లో పనులలో ధర్మసాగర్ వరకు పూర్తయినా నిర్దేశించినా ఆయకట్టుకు నీరివ్వలేకపోతున్నారు.

 

వైఎస్సార్ రాకతో...

 

2004 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయించారు. 1.24 లక్షల ఎకరాల ఆయకట్టుకు మరో 844 ఎకరాల ఆయకట్టును పెంచారు. దీంతో మొదటి విడతకు రూ.1319.38 కోట్లు కేటాయించారు. అప్పటి నుంచి దేవాదుల మొదటి, రెండో దశ పనులు ముందుకు సాగాయి. తొలిదశలో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందుతోంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో మొదటి, రెండు దశలు పైపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తుండగా మూడో దశలో సొరంగం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 58 కిలోమీటర్ల పైపులైను నిర్మాణం కోసం 2005లో రూ.945కోట్లు మంజూరయ్యాయి.



2008లో టెండర్లు నిర్వహించగా ఈ పనులను కోస్టల్ కంపెనీ దక్కించుకుంది. పనులు జరుగుతుండగా శాయంపేట మండలం వసంతపూర్ వద్ద బుంగ ఏర్పడడంతో సొరంగంలో నీరు చేరి ముగ్గురు కార్మికులు జలసమాధి అయ్యారు. అప్పటి నుంని పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు టన్నెల్ నిర్మాణంలో పేల్చివేతల వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం ఏర్పడుతుందని పురావస్తు శాఖ అభ్యంతరం చెప్పడంతో సొరంగం అలైన్‌మెంట్ మార్చాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఈ అలైన్‌మెంట్లు మూడుసార్లు మార్చారు. మూడో సారి అలైన్‌మెంటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top