పౌర సరఫరాలకు ‘వాట్స్‌అప్’ నిఘా

పౌర సరఫరాలకు ‘వాట్స్‌అప్’ నిఘా - Sakshi


అక్రమార్కులకు అందకుండా చర్యలు

బియ్యం సరఫరాపై ఫొటోలతో సమాచారం

తొలిసారిగా జిల్లాలో అమలు


 

హన్మకొండ అర్బన్ : పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలోని సంక్షేమ శాఖ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సరఫరా అవుతున్న సన్నబియ్యం రవాణాపై అధికారులు పక్కా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. సన్నబియ్యం రవాణాలో అక్రమార్కులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. సెల్ ఫోన్లలో ఫొటోలు, సమాచారం చేరవేసేందుకు ఎలాంటి ఖర్చు లేకుండా వినియోగించే వాట్స్‌అప్‌ను వినియోగించుకుంటున్నారు. బియ్యం సరఫరా విషయంలో ప్రతి మూవ్‌మెంట్‌ను, హాస్ట ళ్లు, స్కూళ్లలో నిల్వలను స్థానిక అధికారులతోసహా ఫొటోలు తీసి, సెల్‌ఫోన్ నుంచి వాట్స్ అప్ ద్వారా జేసీ, డీఎస్‌ఓకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నా రు.



జిల్లాలో తొలిసారిగా..



ప్రస్తుతం జేసీ ప్రశాంత్ పాటిల్ ఈ వాట్స్‌అప్ ఆలోచనను జిల్లాలో అమలు చేస్తున్నారు. అవగాహన  కల్పించేందుకు ఇప్పటికే ఓసారి ఏఎస్‌ఓలు, డీటీ సీఎస్‌లు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. వాట్స్ ఆప్ వినియోగించాల్సిన తీరు. సమాచారం చేరవేసే పద్ధతిపై అవగాహన కల్పించారు. ముందుగా పౌర సరఫరాల అధికారులను మాత్రమే భాగస్వాములను చేసినా.. తర్వాత క్రమంలో ఆర్డీలు, తహసీల్దార్లకు తనిఖీల బాధ్యతలు అప్పగించారు. హాస్టళ్లు, స్కూళ్లతోపాటు రేషన్‌షాపుల్లో ఉన్న స్టాకు కూడా ఫొటోలు తీసి పంపించాల్సి ఉం టుంది.  



ప్రతి మూవ్‌మెంట్ నుంచి ఫొటోలు..



ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి  హాస్టళ్లు, స్కూళ్లు, రేషన్ షాపులకు బియ్య సరఫరా అవుతున్నాయి.  అక్రమాలకు బీజం సరఫరాలోనే పడుతోందని అధికారుల అంచనా. ఉదాహరణకు ఒక హాస్టల్ కు ప్రతి నెలా 50 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోందని లెక్కలు చుపిస్తున్నారనుకుందం. వాటిలో వాస్తవంగా హాస్టల్‌కు చేరేవి 20 క్వింటాళ్లు మత్రమే. మిగతావి ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచే దొడ్డిదారికి మళ్లుతున్నాయి. ఇక రేషన్ షాపులదీ ఇదే తంతు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ముందుగా బియ్యం క్షేత్రస్థాయికి చేరినట్లయితే అక్రమాలు కొంతమేరకైనా అరికట్టవచ్చని ఆలోచన చేసిన అధికారులు వాట్స్‌ఆప్ పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి హాస్టల్, స్కూల్, రేషన్‌షాపులో స్టాకు దిగగానే సంబంధిత వార్డెన్, డీటీసీఎస్, ఏఎస్‌ఓలు పరిశీలించాలి. తాము పంపిన స్టాకు పూర్తిగా దిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత.. స్టాకు, పరిశీలించిన అధికారులు అందరూ కనిపించేలా ఫొటోలు తీయాలి. వెంటనే వాటిని జేసీ, డీఎస్‌ఓలకు పంపాలి.



ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకే : డీఎస్‌ఓ ఉషారాణి



ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలోని పేద విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తోంది. కొన్ని స్థాయిల్లో జరిగే అక్రమాల వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది. ఖరీదైన బియ్యం పేదల కడుపునకు చేరకుండా పక్కదారి పట్టే అవకాశం ఉంది. అందుకే జేసీ ఆదేశాలప్రకారం వాట్స్ ఆప్ ద్వారా సమాచారం సేకరిస్తున్నాం. ప్రస్తుతం బియ్యం సరఫరా ప్రారంభమైంది. ప్రతి రోజూ ఫోటోలు వస్తున్నాయి. ఈ విధానం వల్ల బియ్యం క్షేత్రస్థాయికి చేరుతున్న విషయూన్ని ధ్రువీకరించుకోగల్గుతున్నాం.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top