సమయమివ్వండి.. మార్పు చూపిస్తాం

సమయమివ్వండి.. మార్పు చూపిస్తాం - Sakshi


హైదరాబాద్‌ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌

► అభివృద్ధి జరగనిదే జీహెచ్‌ఎంసీలో 99 సీట్లు గెలిపించారా?

► మూసీ రివర్‌ కార్పొరేషన్  ఏర్పాటు చేస్తామని ప్రకటన

► ఎన్ –కన్వెన్షన్ లో అక్రమాలుంటే చర్యలుంటాయని వివరణ




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజూ మంచినీరు సరఫరా చేయాలనుకుంటున్నామని, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రయోగాత్మకంగా దీన్ని మొదలుపెట్టి నగరమంతటికి విస్తరిస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. తొలుత 150 ఎల్‌పీసీడీ చొప్పున దాదాపు 50,000 కుటుంబాలున్న 200 మురికివాడల్లో ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. నగర శివార్లలో నీటి సరఫరాను మెరుగుపరచటానికి రూ.1,700 కోట్ల హడ్కో నిధులు, రూ.200 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌తో ఒక ప్రాజెక్టును రూపొందించామని మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్ప చర్చకు సమాధానమిస్తూ చెప్పారు. నగరంలో 56 రిజర్వాయర్లు నిర్మాణ దశలో ఉన్నాయని, 2,600 కి.మి. పైపులైన్  వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 550 కి.మి. మేర పూర్తి చేశామని చెప్పారు.


50 ఏళ్ల వరకు హైదరాబాద్‌లో సురక్షిత, ఆధారపడదగ్గ నీటి పరఫరా ఉండేలా కృష్ణా, గోదావరి బేసిన్ల కింద 20 టీఎంసీల సామర్థ్యంతో షామీర్‌పేట, దేవలమ్మనగరం వద్ద రెండు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. మురుగు నీటి వ్యవస్థను పటిష్టపరచడానికి నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి రెండు జోన్లలో రూ.400 కోట్లతో పనులు ఇప్పటికే పూర్తి చేసినట్టు చెప్పారు. మరో 4 జోన్లలో రూ.1,200 కోట్లతో పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. స్కైవే, ప్రధాన రోడ్డు కారిడార్, గ్రేడ్‌ సపరేటర్లు వంటివాటితో వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.


ఈ పనుల కోసం రూ.2,631 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు, జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన పరమైన మంజూరు ఇచ్చినట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణాలు చేస్తామని తెలిపారు. ఉప్పల్‌లో ప్రయోగాత్మకంగా వేసిన ప్లాస్టిక్‌ రోడ్డు విజయవంతమైందని, అనేక సర్కిళ్లలో ప్లాస్టిక్‌ రోడ్డు పనులు చేపడుతున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్‌తో మాదాపూర్, హైటెక్‌సిటీని అనుసంధానం చేయడానికి రూ.184 కోట్లతో మాదాపూర్‌ దుర్గం చెరువుపై దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కేబుల్‌ స్టేయిడ్‌ బ్రిడ్జీని వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.



పునరుద్ధరణ టెండర్‌ పూర్తయితేనే తవ్వకాలకు అనుమతి

నగరంలో ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయన్న సభ్యుల ఆందోళనపై కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ తవ్వకాలు జరపాల్సి వచ్చినా, ఆ రోడ్డు పునరుద్ధరణ టెండర్‌ ప్రక్రియ పూర్తయితేనే అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. దీనిపై అవసరమైతే చట్టం తెస్తామన్నారు. నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్‌ పెంచలేదని, కేవలం కొన్ని చోట్ల సవరణలు చేశామని తెలిపారు.



ఆక్రమణలుంటే ఎన్ –కన్వెన్షన్ పై చర్యలు..

అక్రమ నిర్మాణాల అంశాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి ప్రస్తావిస్తూ, బండారి లేఅవుట్, అయ్యప్ప సొసైటీలో అక్రమాలను కూల్చివేసిన ప్రభుత్వం ఎన్ –కన్వెన్షన్  విషయంలో ఎందుకు చోద్యం చూస్తున్నదని ప్రశ్నించారు. ఎన్ –కన్వెన్షన్ ను గిఫ్ట్‌గా ఇవ్వదలిచారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నాగార్జున సర్కిల్‌లో మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారని రేవంత్‌ ప్రశ్నించారు. కేటీఆర్‌ స్పందిస్తూ, తమకు పేద, పెద్ద అన్న తారతమ్యం లేదని, గిఫ్ట్‌ల సంస్కృతి తమకు లేదని స్పష్టంచేశారు. ఎన్ –కన్వెన్షన్  విషయంలో నాగార్జునకు తామేదో మేలు చేస్తున్నామని ఆరోపిస్తున్నారని, అది వాస్తవం కాదని తెలిపారు. అక్రమాలుంటే చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు.



విశ్వనగరం చేసి చూపుతాం

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని, దీనిపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఒక్కరాత్రిలో విశ్వనగరం సాధ్యం కాదని, సమయం ఇస్తే మార్పు చేసి చూపిస్తామని తెలిపారు. రెండున్నరేళ్లలో ఎలాంటి మార్పులేదన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్షాలను తూర్పారబట్టిన మంత్రి, మార్పు లేకుండానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99 సీట్లు సాధించిందా, అని ప్రశ్నించారు. ‘గతంలో కరెంట్‌ కోసం పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారు.


మంచి నీళ్ల కోసం పానిపట్టు యుద్ధాలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు జరిగాయి. శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉండేది. కానీ తెలంగాణ వచ్చాక 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నాం. నీటి సరఫరాను పెంచి వేసవిలో చిన్న ఆందోళన జరగకుండా చూశాం. నేరాలు తగ్గాయి. స్వచ్ఛభారత్‌ అంటే ఫోజులిచ్చి బయట పడటం కాదని, నిజమైన స్వచ్ఛత ఎలా ఉండాలో దేశానికే చేసి చూపించాం. జీహెచ్‌ఎంసీలో యునిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌ తెచ్చాం. గుడుంబా, పేకాటలను బం ద్‌ చేయించాం. ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.



ఏడాది చివరికి మెట్రో పూర్తి

మొదటి విడత మెట్రో పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని, రెండో దశను 2018 చివరకి పూర్తి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. అలైన్ మెంట్‌ మార్పులతో ప్రాజెక్టు ఆలస్యమైందన్న ఆరోపణ నిజం కాదని, మెట్రో పార్కింగ్‌ కోసం ప్రభుత్వ పాఠశాలల స్థలాలను తీసుకుంటు న్నారన్నది వాస్తవం కాదని తెలిపారు. మూసీ నది సుందరీకరణ కోసం మూసీ రివర్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇందుకు రూ.4 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నామని, నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఫుట్‌పాత్‌ వ్యాపారులకు హాకింగ్‌ జోన్ లు ఏర్పాటు చేస్తామని, వచ్చే సమావేశాల్లో స్ట్రీట్‌ వెండర్‌ బిల్లు తెస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top