సిటిజన్‌ ఫోరం ఓ ఉద్యమం లాంటింది

సిటిజన్‌ ఫోరం ఓ ఉద్యమం లాంటింది - Sakshi


► ప్రతి ఒక్కరూ మిషన్‌గా తీసుకొని పనిచేయండి

► ప్రస్తుత పనితీరు బాగాలేదు.. మెరుగుపరుచుకోవాలి

► జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌


మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజల మద్దతు కూడగట్టుకొని సిటిజన్‌ ఫోరంను ఒక ఉద్యమంలాగ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత సభ్యుల ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్రజైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ అన్నారు. సిటిజన్‌ ఫోరంను ఒక మిషన్‌గా తీసుకొని సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. జిల్లా సిటిజన్‌ ఫోరం శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్‌ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.



రాష్ట్రంలో మొదటి సారిగా ఖమ్మం జిల్లాలో సిటిజన్‌ ఫోరం ఏర్పాటు చేసి విజయవంతం అయ్యామని, అదే పద్ధతిలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఈ ఫోరం ఏర్పాటు చేశామన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత నాలుగు జిల్లాలో ఆశించిన స్థాయిలో పనితీరులేదని, దానిని మెరుగు పరుచుకోవాలని సిటిజన్‌ ఫోరం అంటే ఒక సంస్థ కాకుండా ఉద్యమంగా భావించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉందని, దీంట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎక్కువగా ఉందన్నారు.



దీనిపై సభ్యులు స్పందించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక రూపం తీసుకురావడానికి ఈ సిటిజన్‌ ఫోరం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జైళ్లను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అక్షరం రాకుండా జైలుకు వచ్చిన ఖైదీలకు తిరిగే వెళ్లే సమయానికి పుస్తకాలు చదివే స్థాయిలో విద్య నేర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం లేకుండా జరిగే పరిపాలనను సిటిజన్‌ ఫోరం నుంచి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలన్నారు.



అంతకుముందు టీజేఏసీ ఛైర్మన్‌ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తిచూపడానికి సిటిజన్‌ ఫోరం అనే ఒక మొక్క నాటడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్‌ దశరథరాంరెడ్డి, జైలర్‌ శ్రీనునాయక్, ఉపేందర్, డిప్యూటీ జైలర్‌ సుధాకర్‌రెడ్డి, టీఏఎన్జీవో అధ్యక్షుడు రామకృష్ణారావు, చంద్రనాయక్, సాజిదసికిందర్, రాజమల్లెష్, జగపతిరావు, రవీందర్‌రెడ్డి, నాలుగు జిల్లాల సభ్యులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.



జైలును పరిశీలించిన డీజీ :  జిల్లా జైలును సోమవారం రాత్రి జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ పరిశీలించారు. సుదర్శన్‌గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత జైలును పరిశీలించి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. డీజీ వెంట సూపరింటెండెంట్‌ దశరథరాంరెడ్డి ఇతర సిబ్బంది ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top