పండుగకు చీ‘కట్’లు

పండుగకు చీ‘కట్’లు - Sakshi


కరీంనగర్ సిటీ :

 అసలే కొత్త రాష్ట్రం.. తొలిసారి బతుకమ్మ రాష్ట్ర పండుగగా గుర్తింపు.. ఈ నేపథ్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పల్లెలు ముస్తాబవుతుంటే ట్రాన్స్‌కో అధికారులు ఒక్క సారిగా పంచాయతీలకు ‘షాక్’ ఇచ్చారు. విద్యుత్ బకాయిల కారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలకు కనెక్షన్లు తొలగించిన అధికారులు..  మరిన్ని గ్రామాల్లోనూ పవర్ కట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫలితంగా పండుగపూట పల్లెల్లో అంధకారం అలుముకుంది. ఇప్పటికే గ్రామపంచాయతీలు, ట్రాన్స్‌కో అధికారుల మధ్య ఉన్న కరెంట్ బకాయిల పంచాయితీ తారాస్థాయికి చేరింది. బకాయిలు చెల్లించాల్సిందేనంటూ రెండురోజులుగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు తదితర మండలాలతోపాటు జిల్లాలోని పలు గ్రామపంచాయతీలకు ట్రాన్స్‌కో నోటీసులు జారీ చేసింది. గురువారం ఏకంగా కనెక్షన్లను తొలగించింది. గంగాధర మండలం గట్టుభూత్కూరు, గర్షకుర్తి, ఒడ్యారం, తాడిజెర్రి, కాచారం తదితర పది పంచాయతీలకు పవర్ తొలగించారు. దీనిపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. అయినా తామేం చేసేది లేదని ట్రాన్స్‌కో అధికారులు జవాబిస్తున్నారు.

 గ్రామాల్లో నీటి సరఫరా, వీధి దీపాల కోసం వినియోగించే విద్యుత్ బిల్లులను గతంలో రాష్ట్ర ప్రభుత్వమే భరించేది. కానీ.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆ భారాన్ని పంచాయతీలే మోయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ‘పంచాయతీలకు వస్తున్న నిధులే అంతంతమాత్రం.  అందులోంచి విద్యుత్ బిల్లులు ఎలా చెల్లిస్తాం..’ అంటూ సర్పంచ్‌లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సర్పంచ్‌ల సంఘం కూడా ఈ నిర్ణయాన్ని తప్పు పడుతూ విద్యుత్ బకాయిలు చెల్లించొద్దంటూ సర్పంచ్‌లకు సూచించింది. దీనిపై కొద్దికాలంగా మౌనంగా ఉన్న ట్రాన్స్‌కో అధికారులు, సీఎండీ సమావేశం మరుసటి రోజే విద్యుత్ కనెక్షన్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో పవర్‌కట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బతుకమ్మ ఆడేందుకు వీలుగా వీధి దీపాలు పెంచాలని సర్పంచులు ఆలోచిస్తున్న తరుణంలో మొత్తానికే కరెంట్ తొలగించడంతో గ్రామాలు అంధకారంగా మారుతున్నాయి. మొత్తంగా వెలుగు, జిలుగుల మధ్య.. ఆర్భాటంగా బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవాలని ఆరాటపడుతున్న గ్రామాలకు ట్రాన్స్‌కో గట్టిషాక్ ఇచ్చినట్లయ్యింది.

 





 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top