సీఐడీ వర్సెస్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌!

సీఐడీ వర్సెస్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌! - Sakshi


బోధన్‌ స్కాంలో నిందితులకు ఉన్నతాధికారుల వత్తాసు

పరారీకి సహకరించారని సీఐడీ ఆగ్రహం

ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు




సాక్షి, హైదరాబాద్‌: కమర్షియల్‌ ట్యాక్స్‌ విభాగంలో నకిలీ చలాన్లతో కోట్లు కొట్టేసిన (బోధన్‌ స్కాం) నిందితులకు ఆ విభాగపు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారంటూ సీఐడీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై వాణిజ్య పన్నుల విభాగం ముఖ్య కార్యదర్శికి సీఐడీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో ఆ విభాగపు ఉన్నతాధికారుల పాత్రపైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నుంచి పక్కాగా ఆదేశాలు వచ్చాయని సీఐడీ వర్గాలు తెలిపాయి. (బో‘ధన్‌’ దొంగలెందరో?)




పరారీ.. ఆశ్రయం: బోధన్‌ స్కాంలో ప్రాథమికంగా నిందితులుగా ఉన్న ఏసీటీవో, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లకు పరారీలో తోడ్పడింది ఇద్దరు íసీటీవోలు, ఇద్దరు జాయింట్‌ కమిషనర్లని సీఐడీ విచారణలో బయటపడింది. ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌కు ఆశ్రయం ఇవ్వడంలోనూ వీరి పాత్ర కీలకమని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. స్కాంలో కీలక సూత్రధారిగా ఉన్న శివరాజ్, సునీల్‌ కర్ణాటకలో తలదాచుకున్నట్టు గుర్తించారు.(‘కమర్షియల్‌’ స్కాంపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌)



విచారణకు సహకరించాలి: ఈ కుంభకోణం వ్యవహారంలో తమ దర్యాప్తునకు సహకరించాలని సీఐడీ విజ్ఞప్తి చేసిందని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఉదంతంపై తాము కూడా అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని, తమ అధికారుల పాత్రపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, దాన్ని బట్టి సీఐడీ అధికారులు విచారించుకోవచ్చని స్పష్టం చేశారు. నిందితులకు సహకరిస్తున్న అధికారుల వివరాలను సీఐడీ నుంచి తీసుకుంటామని, ఈ కేసులో సీఐడీకి ఒత్తిళ్లు లేకుండా చూస్తున్నామని కమర్షియల్‌ ట్యాక్స్‌ విభాగంలోని కీలక అధికారి ఒకరు చెప్పారు.



వణికిపోతున్న అధికారులు...

ఈ స్కాంలో దోచుకున్న డబ్బులు ఖాతాల్లో వేసుకున్న కమర్షియల్‌ ట్యాక్స్‌ ఉన్నతాధికారుల్లో వణుకు మొదలైనట్టు తెలిసింది. శివరాజ్, సునీల్‌ సహా 22 మంది ములాఖత్‌ అయ్యారని, హైదరాబాద్‌లోని రెండు హోటళ్లలో రహస్యంగా సమావేశమై డబ్బు పంచుకున్నట్టు సీఐడీ గుర్తించింది. వీరిలో నలుగురు సీటీవోలు, నలుగురు జాయింట్‌ కమిషనర్లు కూడా ఉండటంతో ఆ విభాగంలో తీవ్ర చర్చ ప్రారంభమైంది. ఎప్పుడు, ఏ సమయంలో సీఐడీ అధికారులు ఎవరి ఇంట్లో దాడులు చేస్తారో తెలియక ఆ అధికారులు భయాందోళనలో ఉన్నారని తెలుస్తోంది. శివరాజ్, సునీల్‌ సీఐడీకి దొరికితే అందరి బాగోతం బయటపడుతుందని, వారి విచారణలో ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని హడలిపోతున్నారని సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top