నేడో రేపో సీఐల బదిలీలు..?

నేడో రేపో సీఐల బదిలీలు..? - Sakshi


* ఆ ఏడు సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం పైరవీలు  

* నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో అధికారులు


సూర్యాపేట : జిల్లాలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌స్థాయి పోలీస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. సాధారణ ఎన్నికల అనంతరం సీఐల బదిలీలు ఉంటాయన్న ఊహాగానాలు కొద్ది నెలలుగా వినిపిస్తున్నాయి. గత నెలలో ఒకసారి బదిలీలు జరిగినా,  రాజకీయ జోక్యంతో హైదరాబాద్ జోన్‌స్థాయిలో ఆగిపోవడంతో జిల్లాలో బదిలీలు నిలిచిపోయాయి. తాజాగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌స్థాయి అధికారులను బదిలీ చేసేందుకు రాష్ట్రస్థాయిలో కసరత్త్తు ప్రారంభమైంది. హైదరాబాద్ రేంజ్ పరిధిలో రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన సీఐలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు జాబితా సిద్ధం చేసినట్లు పోలీస్‌వర్గాల్లో విసృ్తత ప్రచారం జరుగుతోంది. అయితే ఫుల్‌చార్జ్ ఐజీ లేకపోవడంతో బదిలీల్లో ఆలస్యమవుతుందని చెబుతున్నారు.

 

కీలకస్థానాల కోసం ప్రయత్నాలు..

జిల్లాలో కీలక ప్రాంతాల్లో పాగా వేసేందుకు పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ముందు ఇతర జిల్లాల నుంచి వచ్చి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పలువురు సీఐలు సైతం జిల్లా నుంచి బయటపడేందుకు తమకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కీలక సర్కిళ్లలో పాగా వేసేందుకు ముమ్మరయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు సీఐలు ఎన్నికలకు ముందు మెదక్, రంగారెడ్డి జిల్లాలకు బదిలీ అయ్యారు. వారిలో అనేకమంది తిరిగి జిల్లాలో పోస్టింగ్ కోసం తమకున్న రాజకీయ పరిచయాలను ఉపయోగించుకునే పనిలోపడ్డారు. ఇప్పటికే పలువురు సీఐలను తమ నియోజకవర్గాల్లోని కీలకస్థానాల్లో నియమించాలని అధికార పార్టీ నేతలు కొందరు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సీఐల బదిలీలు భారీగానే ఉండవచ్చని భావిస్తున్నారు.

 

ఖాళీలు పెద్దగా లేకపోయినా కన్ను..

నిబంధనల ప్రకారం.. జిల్లాలో సీఐల పోస్టులు పెద్దగా ఖాళీ లేకపోయినా రాజకీయ ఆశీస్సులతో ఏదైనా సాధించవచ్చుననే భానవతో అనేకమంది ఉన్నారు. పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న సీఐలు, జిల్లాలో అప్రాధాన్యత పోస్టుల్లో కొనసాగుతున్న సర్కిల్‌ఇన్‌స్పెక్టర్లు అధికార పార్టీ నేతల ఆశీస్సులతో కీలకస్థానాలు పొందేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లాలో గడువు పూర్తిచేసుకున్న సీఐలను ఎన్నికలకు ముందే బదిలీ చేశారు. ఒక స్టేషన్‌లో రెండేళ్లు పూర్తిచేసుకున్న సీఐలకు మాత్రమే బదిలీకి అర్హత ఉంది.

 

ఎవరి ప్రయత్నాలు వారివి..

జిల్లాలో కీలక పోలీస్‌స్టేషన్లుగా భావిస్తున్న హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేటటౌన్, నకిరేకల్, దేవరకొండ, మిర్యాలగూడ రూరల్, భువనగిరితోపాటు పలు కీలక పోలీస్‌స్టేషన్లకు సీఐలుగా రావడానికి పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతల అశీస్సులతో సీఐలు తాము కోరుకున్న చోటు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. అయితే జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కోరుకునే అధికారులే ఈసారి జిల్లాలో ఎక్కువగా ఉండడం గమనార్హం. జిల్లాలో కీలకస్థానాల్లో పనిచేస్తున్న ఒకరిద్దరు సీఐలు ఇక్కడ పనిచేయడం కన్నా, తమ సొంత జిల్లాలో లూప్‌లైన్ పోస్టులు ఇచ్చినా చాలనే భావనలో ఉన్నారు. అక్కడి అధికార పార్టీ నేతలతో తమకున్న పరిచయాల మేరకు మళ్లీ ఆయా జిల్లాలకు బదిలీ చేయించుకోవడానికి హామీ పొందినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top