బాలశాస్త్రవేత్తలుగా ఎదగాలి

బాలశాస్త్రవేత్తలుగా ఎదగాలి - Sakshi


 విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

 

 భువనగిరి : విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను ఉపాధ్యాయులు వెలికితీసి ఇలాంటి ప్రదర్శనల్లో చాటిచెబితేనే భవిష్యత్తులో వారు బాలశాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశముంటుందని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో ఏపీజే అబ్దుల్ కలాం ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా ఇన్‌స్పైర్ అవార్డ్స్ 2015ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు తమ మేథస్సుకు పదును పెట్టాలని, వారి అభిరుచికి అనుగుణంగా ఉపాధ్యాయుల సహకారం అవసరముంటుందన్నారు. ప్రతి పనిలో పరిశోధన చేయాలని, అపుడే దేశం గర్వించదగ్గ విద్యావంతులు పుట్టుకొస్తారన్నారు.



డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేసిన పరిశోధనల ఫలితంగా ప్రపంచంలో భారత్ సూపర్‌సానిక్ దేశంగా తలెత్తుకుని నిలిచిందని, అగ్రదేశాలతో సమానంగా ఆయుధ సంపత్తిని రూపొందించన ఘనత కలాంకు దక్కుతుందన్నారు. శాస్త్రవేత్తల  నిరంతర పరిశోధనల వల్ల ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని, ప్రస్తుతం ప్రజలు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమేనన్నారు. బంగారు తెలంగాణకోసం కలలు కంటున్న కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ముందుకెళ్లాలన్నారు.



 మట్టిలో మాణిక్యాలను గుర్తించాలి

 గ్రామాల్లోని మట్టిలో మాణిక్యాల్లాంటి విద్యార్థుల ను ఉపాధ్యాయులు గుర్తించాలని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. దేశానికి కావాల్సిన పరిశోధనలు చేసేలా విద్యార్థులను తయారు చేయాలన్నారు. అనంతరం భువనగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ మాట్లాడారు. పిల్లలు భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి కుటుంబ సహకారం అవసరమని, చదువుతోపాటు సాంకేతిక తెలివితేటలు కూడా అవసరమవుతాయన్నారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మతకు ఇన్స్‌పైర్ అవార్డులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్‌లు మాట్లాడారు.



ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు పరిశోధనలు చేసేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని, వాటిని విద్యార్థులు సద్వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. విశ్వనాధరావు, ఆర్డీఓ ఎన్. మధుసూదన్, డీఎస్సీ సాధు మోహన్‌రెడ్డి, ఎంపీపీ తోటకూర వెంకటేష్‌యాదవ్, జెడ్పీటీసీ సందెల సుధాకర్, సర్పంచ్ రాయపురం అశోక్, డెప్యూటీ డీఈఓ మదన్‌మోహన్, సైదానాయక్, ీహర్యానాయక్, పాండునాయక్, తహసీల్దార్ కె. వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.



 ప్రదర్శనలో అబ్బురపరిచిన నమూనాలు

 ప్రదర్శనలో విద్యార్థుల సృజనాత్మకత బయటపడింది. విద్యార్థులు వివిధ అంశాలపై తయారుచేసిన నమూనాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 394 మంది విద్యార్థులు ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. భువనగిరికి చెందిన బీచ్‌మహల్లా, ఆలేరుకు చెందిన జెఎంజే పాఠశాలల విద్యార్థులు తయారుచేసిన రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే యంత్రాలను చూసి మంత్రి మెచ్చుకున్నారు. అలాగే స్పీడ్ బ్రేకర్‌ల ద్వారా విద్యుత్ ఉత్పాదన, మిషన్ కాకతీయ, రోప్‌వే, ఇసుకతరలింపుతో ఇంకే భూగర్బజలాలు, సోలార్ హీటర్, ప్లాస్టిక్‌ను తినే బ్యాటరీలు, బోటానికల్‌ఫుడ్, ఆవుపేడ నుంచి విద్యుత్ ఉత్పాదన, మధ్యాహ్న భోజనంలో అందని పోషకాలు, నీటిలో తేలే ఇటుక, ఉప్పు నీటినుంచి విద్యుత్ తయారుచేయుట వంటి నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top