బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

బాలుడికి అరుదైన శస్త్రచికిత్స - Sakshi

  • బోన్ క్యాన్సర్ బాధితుడికి ఆపరేషన్

  •  వయసుతోపాటు పెరిగే అధునాతన రాడ్ అమరిక

  •  రాష్ర్టంలో ఇదే తొలి శస్త్రచికిత్సగా వైద్యుల వెల్లడి

  • సాక్షి, సిటీబ్యూరో: తొడ ఎముక క్యాన్సర్ (ఈవింగ్ సర్కోమా)తో బాధపడుతున్న తొమ్మిదేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో ఇదే ప్రథమమని వారు వెల్లడించారు. అమెరికన్ ఆంకాలజీ ఆస్పత్రి వైద్యులు ఈ శసతచ్రికిత్సను విజయవంతంగా నిర్వహించారు. క్యాన్సర్ సోకిన భాగాన్ని పూర్తిగా తీసేసి ఆ స్థానంలో బాలుడి వయసుతోపాటు పెరిగే అధునాతన రాడ్‌ను అమర్చి ఎందుకూ పనికి రాకుండా చచ్చుపడిపోయిన అతని కాలుకి పునర్జన్మను ప్రసాదించారు. శుక్రవారం హోటల్ ఎన్‌కేఎం గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమెరికన్ ఆంకాలజీ ఆస్పత్రికి చెందిన ప్రముఖ బోన్ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ కిషోర్ బి రెడ్డి



    శస్త్రచికిత్సకు సంబంధించి వెల్లడించిన వివరాలు..



    కర్ణాటకలోని బీదర్‌కు చెందిన దర్శన్(9) కుడికాలు తొడ ఎముక వాపుతో బాధపడుతున్నాడు. అతని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించారు. తొడలో ఇన్‌ఫెక్షన్ ఉందని చెప్పి ఆరు నెలల క్రితం సర్జరీ చేశారు. శస్త్రచికిత్స తర్వాత జబ్బు నయం కాకపోగా మరింత ముదరడంతో మళ్లీ వైద్యులను సంప్రదించారు. అనుమానం వచ్చి బయాప్సీ చేయగా, అప్పటికే క్యాన్సర్ సోకి తొడ ఎముక పూర్తిగా పాడైనట్టు గుర్తించారు. కాలును తొలగించడం ఒక్కటే దీనికి పరిష్కారమని చెప్పడంతో బాలుని తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురయ్యారు.



    ఈ అంశంపై మరో నిపుణుడి సలహా తీసుకోవాలని భావించి ఐదు నెలల క్రితం అమెరికన్ ఆంకాలజీ ఆస్పత్రిలోని ప్రముఖ బోన్ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ కిషోర్ బి రెడ్డిని సంప్రదించారు. వయసుతోపాటు పెరిగే అధునాతన రాడ్‌ను అమర్చడం ద్వారా బాలుడి కాలును కాపాడవచ్చని సూచించారు. దీనికి వారు అంగీకరించడంతో నెల రోజులపాటు కీమో థెరపీ నిర్వహించారు. క్యాన్సర్ కణాలన్నీ చనిపోయిన తర్వాత మూడు వారాల క్రితం బాలుడికి శ స్త్రచికిత్స చేశారు.



    క్యాన్సర్ సోకిన 44 సెంటీమీటర్ల పొడవు ఎముకను కట్ చేసి తొలగించి, దాని స్థానంలో బాలుడి వయసుతోపాటు పెరిగే అధునాతన రాడ్‌ను సుమారు ఏడున్నర గంటలపాటు శ్రమించి అమర్చారు. బాలుడికి యుక్తవయసు వచ్చే వరకు అతని శారీరక ఎదుగుదలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాడ్డు పొడవును పెంచుకునే వీలుంది. ఇలా ప్రతి ఆరు నెలలకోసారి చేయాల్సి ఉంది. ఇలా చేసిన ప్రతిసారి మోకాలు జాయింట్స్ పైభాగంలో ఓ చిన్న రంధ్రం చేసి కండరాల లోపల అమర్చిన ఇంప్లాంట్ పొడవు (జాకీ మాదిరిగా ఉండే స్క్రూను తిప్పడం వల్ల) పెంచవచ్చు.



    దీని ఖరీదు రూ.30 లక్షలు కాగా, తయారీ కంపెనీతో స్వయంగా మాట్లాడి బాలుడికి రూ.16.50 లక్షలకే సమకూర్చినట్టు డాక్టర్ కిషోర్ బి రెడ్డి చెప్పారు. పదిహేనేళ్లలోపు ఉన్న ప్రతి పదివేల మంది పిల్లల్లో ఎవరో ఒకరు మాత్రమే ‘ఈవింగ్ సర్కోమా’ క్యాన్సర్ బారిన పడుతారని తెలిపారు. ప్రపంచంలో ఏటా 10-15 సర్జరీలకు మించి జరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఇదే తొలి సర్జరీ అని ప్రకటించారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎలాంటి సపోర్టు లేకుండా స్వయంగా నడుస్తున్నట్టు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top