చిన్నారి క్షేమం

చిన్నారి క్షేమం - Sakshi


 మంచాల : నాలుగు నెలల క్రితం కనిపించకుండా పోయిన చిన్నారి క్షేమంగా ఉంది. గతంలో పోషణ భారమై తల్లిదండ్రులు దత్తత ఇచ్చారు. శనివారం అధికారికంగా ఐసీడీఎస్ అధికారులు చిన్నారిని అప్పగించారు. వివరాలు.. మండల పరిధిలోని ఆంబోత్ తండాకు చెందిన ఆంబోత్ మాధవి, శంకర్ దంపతులకు కూతురు వైష్ణవి(3) ఉంది. గత మార్చి 5న రెండో సంతానంగా కూడా పాప పుట్టింది. ఆర్ధిక పరిస్థితి బాగలేకపోవడంతో మాధవి చెన్నారెడ్డిగూడలోని తన తల్లిదండ్రులైన రామావత్ పరంగీ, శంకర్‌ల సాయంతో అదేనెల 10న లింగంపల్లి గ్రామానికి చెందిన మైలారం వీరేషం,స్వరూప దంపతులకు పాపను దత్తత ఇచ్చారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. చిన్నారి విషయమై స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పాపను చంపేశారని, విక్ర యించారని అప్పట్లో పుకార్లు వ్యాపించాయి.



 దీంతో శనివారం స్థానిక సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ సభ్యురాలు రాణెమ్మ, గ్రామ పెద్దలు పాప ఎక్కడున్నా తక్షణమే తీసుకురావాలని మాధవి, శంకర్ దంపతులకు తేల్చిచెప్పారు. విషయం ఐసీడీయస్ అధికారులకు కూడా చెప్పారు. పాపను తీసుకొని తల్లిదండ్రులు, అమ్మమ్మతాతలు వచ్చారు. పాపను పెంచే స్థోమత తమకు లేదని చెప్పారు. అందుకే లింగంపల్లి గ్రామానికి చెందిన వారికి ఇచ్చామని చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధుల సమక్షంలో ఐసీడీయస్ అధికారులు చట్టప్రకారం పత్రం రాయించుకొని పాపను స్వరూప, వీరేషం దంపతులకు దత్తత ఇచ్చారు. పాపను బాగా చూసు కుంటామని వారు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top