‘ఛీ’కోడ్!

‘ఛీ’కోడ్! - Sakshi


పాపన్నపేట: చుట్టూరా మంజీర ఉన్నా.. తాగునీరు కరువై పల్లె ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం రూ.4.60 కోట్లతో తాగునీటి పథకాన్ని మంజూరు చేసినా, పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి చీకోడ్ తాగునీటి పథకానికి గ్రహణంగా మారింది. పాపన్నపేట మండలం చుట్టూరా మంజీర నది సుమారు 34 కిలో మీటర్ల మేర ప్రవహిస్తోంది. ప్రతి పల్లెకు మంజీర రక్షిత మంచినీటిని    అందించాలని మండలంలో ఇప్పటికే కొత్తపల్లి, పొడిచన్‌పల్లి, కొడుపాక తాగునీటి పథకాలను ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన మరో 14 గ్రామాలకు తాగునీరు నీరందించాలన్న ఉద్దేశంతో.. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద 2013లో చీకోడ్ తాగు నీటి పథకం మంజూరైంది.



ఇందుకు రూ. 4.60 కోట్లు విడుదలయ్యాయి. ఈ పథకం కింద చీకోడ్, కొత్తలింగాయపల్లి, అమ్రియా తండా, మల్లంపేట, రామతీర్థం, ముద్దాపూర్, కొత్తపల్లి(మధిర), మొదల్లకుంట తండాలోని సుమారు 6,176 జనాభాకు ర క్షిత మంజీర నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటితో పాటు అవసరమైతే మరో 6 గ్రామాలకు తాగునీరందించాలని నిర్ణయించారు. ఇందుకు కుర్తివాడ వద్ద మంజీర నదిలో ఇన్‌టేక్‌వెల్ నిర్మించి, సమీపంలోని మిన్‌పూర్ గుట్టపై ఓవర్ హెడ్ రిజర్వాయర్ ఏర్పాటు చేసి, పైపులెన్ల ద్వారా తాగు నీటిని పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.



ఈ పనిని యేడాదికాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. కాని ఆరు నెలల గడిచినా పనులు ఊపందుకోలేదు. ఇప్పటివరకు నదిలో ఇన్‌టేక్‌వెల్‌కు సంబంధించి పనులు ప్రారంభించలేదు. కేవలం మిన్‌పూర్ గుట్టపై ఓవర్‌హెడ్ రిజర్వాయర్ కోసం వారం రోజుల క్రితం మొక్కుబడిగా పనులు ప్రారంభించారు. కుర్తివాడ సమీపంలో కొన్ని పైపులు ఉంచారు. పనులు సకాలంలో ప్రారంభించకపోవడంతో తాగునీటికి అనేక అవస్థలు పడుతున్నామని చీకోడ్,లింగాయపల్లి,అమ్రియా తండా, మధిర కొత్తపల్లి, మొదల్లకుంట తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తమ పరిస్థితి ఉందని వాపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top