ట్రామా ‘కేర్’ ఏదీ..?

ట్రామా ‘కేర్’ ఏదీ..? - Sakshi


- ఏడాది క్రితం రూ.5.92 కోట్లు మంజూరు

- యూనిట్ ఏర్పాటులో జాప్యం

- సకాలంలో వైద్యం అందక బాధితుల మృత్యువాత

తాండూరు: తాండూరులో  ట్రామా కేర్ యూనిట్ ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. కర్ణాటక సరిహద్దులో రోడ్డు ప్రమాద బాధితులకు ప్రత్యేక వైద్య సేవలందించేందుకు   ట్రామా కేర్ యూనిట్‌ను  తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో  ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు దాదాపు ఏడాది క్రితమే సుమారు రూ.5.92కోట్ల నిధులు మంజూరయ్యాయి. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ఇలాకాలో ట్రామా కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంలో వైద్యవిధాన పరిషత్ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్టు స్పష్టమవుతోంది.



వివరాల్లోకి వెళితే...

కర్ణాటక సరిహద్దులో ఉన్న తాండూరులో వందలాది నాపరాతి పాలిషింగ్ యూనిట్‌లు ఉన్నాయి. నాలుగు సిమెంట్ కర్మాగారాలు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి.  వ్యాపార,వాణిజ్య కేంద్రమైన తాండూరులో వాహనాలు, జనాల రద్దీ అధికంగా ఉంటుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రమాదాల్లో గాయపడినవారికి జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు మినహా పూర్తి స్థాయి వైద్య సేవలు అందని పరిస్థితి.  క్షతగాత్రులు 120 కి.మీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు రిఫర్ అవుతుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లేలోపు ఎందరో మృత్యువాత పడుతున్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు, సకాలంలో ప్రత్యేక అత్యవసర వైద్య సేవలు అందక మృతి చెందుతున్నారు.  ఇలాంటి మరణాలను తగ్గించాలనే యోచనతో తాండూరుకు ట్రామా కేర్‌యూనిట్ మంజూరైంది.

 

అధునాతన సౌకర్యాలు

బెంగళూరు-ముంబయ్ జాతీయ లింకు రహదారిలో ఉన్న తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(ఏపీఎస్‌ఎంఐడీసీ) ట్రామా సెంటర్‌ను ఏర్పాటుకు నిర్ణయించారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్లతోపాటు స్టాఫ్ నర్సులు, ప్రత్యేక అత్యవసర వైద్య సదుపాయాలు కలిగిన అంబులెన్స్, అధునాతన సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక వైద్య సిబ్బంది వసతులు ఇక్కడ సమకూర్చాల్సి ఉంది. ప్రత్యేకంగా ఐసీయూను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ట్రామా సెంటర్ కోసం మొత్తం రూ.5.92 కోట్ల నిధులను  మంజూరు చేశారు.  ఇందులో రూ.5కోట్లతో పరికరాలు, వసతులు, రూ.80లక్షలతో భవనాలు తదితర సివిల్ పనులు, మరో రూ.12లక్షలతో అంబులెన్స్‌ను సమకూర్చనున్నారు.

 

50శాతం కేసులు హైదరాబాద్‌కు రిఫర్...

తాండూరు మండలం కర్ణాటక సరిహద్దు మార్గంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికంగా ఉంది. ప్రమాదాల్లో గాయపడ్డ వారికి తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో కేవలం ప్రాథమిక చికిత్సలు మాత్రమే అందుతాయి.  50శాతం కేసులను హైదరాబాద్‌కు రిఫర్ చేయక తప్పదు. అయితే ఈ ట్రామా సెంటర్ అందుబాటులోకి రావడం వల్ల ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అన్ని రకాల వైద్యపరీక్షలు చేయడం ద్వారా శరీరంలో తలకు, స్కిన్, మజిల్స్,సాఫ్ట్ టిష్యూ ఇతర ప్రాంతాల్లో తీవ్ర గాయాలు, ఎముకలు విరగటం ఇక్కడనే గుర్తించి, అవసరమైన ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి ఆస్కారం కలుగుతుంది. ఇంతవరకూ ఇలాంటి సౌకర్యం లేకపోవడంవల్ల  క్షతగాత్రులను హైదరాబాద్‌కు రిఫర్ చేసినా అక్కడికి వెళ్లేలోగా మార్గమధ్యలోనే చాలామంది మరణించిన సందర్భాలు ఉన్నాయి.

 

రోడ్డు ప్రమాదాలు ఇలా...


గత రెండేళ్లుగా తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, కరన్‌కోట్, పెద్దేముల్,యాలాల, బషీరాబాద్ పోలీసుస్టేషన్‌ల పరిధిలో  సుమారు 200కుపైగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 90మంది గాయపడ్డారు. సుమారు 50మంది మరణించారు. బెంగళూరు-ముంబయ్ హైవేలోని కరన్‌కోట్ పోలీసుస్టేషన్ పరిధిలో 50 రోడ్డు ప్రమాదాల్లో 34మంది గాయపడగా, 20మంది మృతి చెందటం రోడ్డు ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తోది. మిగితా పోలీసుస్టేషన్‌ల పరిధిలో కూడా పది వరకూ మరణాలు క్రమం తప్పక నమోదవుతున్నాయి.  నెల రోజుల క్రితం తాండూరు పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.వీరిలో సకాలంలో వైద్య సేవలు అందక మార్గమధ్యంలో చనిపోయినవారే అధికం.

 

ఈ సెంటర్‌తో ప్రత్యేక వైద్య సేవలు

ట్రామా కేర్‌సెంటర్ యూనిట్ ఏర్పాటుకు పైఅధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి మొదటి గంటలోపే ప్రత్యేక వైద్య సేవలు అందుతాయి. జనరల్ ఆస్పత్రిలో మాదిరిగా కాకుండా ఈ సెంటర్‌లో రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు చికిత్సలు చేసుకోవడానికి ప్రత్యేక వైద్యులు,సిబ్బందితో పాటు అనేక సౌకర్యాలు ఉంటాయి. త్వరగా ఏర్పాటయ్యేలా ఉన్నతాధికారులతో మాట్లాడతాను. -డా.వెంకటరమణప్ప, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top