‘ఛత్తీస్’ అభ్యంతరాలపై దాటవేత!

‘ఛత్తీస్’ అభ్యంతరాలపై దాటవేత! - Sakshi


పొంతన లేని సమాధానాలిచ్చిన డిస్కంలు

విద్యుత్ కొన్నా.. కొనకున్నా


చార్జీల చెల్లింపునకు సమర్థన

ఛత్తీస్‌గఢ్ విధించే పన్నులు,

సుంకాలు భరించాల్సిందేనని ఒప్పుకోలు


సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)పై విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)లో దాఖలైన అభ్యంతరాలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ‘తగిన’ రీతిలో సమాధానాలు ఇవ్వలేకపోయాయి. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగనుందని విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ పార్టీల నేతలు లేవనెత్తిన అభ్యంతరాలకు డిస్కంల సమాధానాలు అసంబద్ధంగా, పొంతన లేకుండా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినా.. చేయకపోయినా పూర్తి మొత్తంలో 1000 మెగావాట్లకు చార్జీలు ఎల్లవేళలా చెల్లించేందుకు ఒప్పందంలో అంగీకరించడాన్ని డిస్కంలు సమర్థించుకున్నాయి.


విద్యుత్ కొన్న మేరకే చార్జీలు చెల్లిస్తామని ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిన డిస్కంలు తాజాగా మాట మార్చాయి. ఛత్తీస్‌గఢ్ ఇంకెవరికీ విక్రయించుకోకుండా మొత్తం విద్యుత్ రాష్ట్రానికే కేటాయించేందుకు ఈ నిబంధన అవసరమేనని తేల్చి చెప్పాయి. ఈ నెల 11న ఛత్తీస్‌గఢ్ పీపీఏపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించనున్న నేపథ్యంలో తాజాగా డిస్కంలు తమ వివరణలను ప్రకటించాయి. రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 24,075 మెగావాట్లకు పెంచి 2018లోగా తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూనే ఛత్తీస్ నుంచి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు... వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్‌తో పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు, ఎత్తిపోతల పథకాల భవిష్యత్ అవసరాలకు ఈ ఒప్పందం చేసుకున్నామని బదులిచ్చాయి.


అదే విధంగా ఛత్తీస్ జెన్‌కోతో అక్కడి డిస్కం చేసుకున్న మాతృ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఆ రాష్ట్ర ఈఆర్‌సీ ఇంకా ఆమోదించనే లేదు. అయినా అక్కడి డిస్కంతో రాష్ట్ర డిస్కంలు చేసుకున్న ‘పిల్ల’ ఒప్పందాన్ని మాత్రం ఆమోదించాలని తెలంగాణ ఈఆర్‌సీని కోరినట్లు సమాచారం. ఇక విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు కేటాయింపుల వివరాలు సైతం డిస్కంలు వెల్లడించలేకపోయాయి. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం కాలానుగుణంగా విధించనున్న పన్నులు, సుంకాలను రాష్ట్రమే భరించక తప్పదని డిస్కంలు పేర్కొన్నా యి.


ఈ ఒప్పందంపై టీజేఏసీ చైర్మన్ కోదండరాం, కాం గ్రెస్, టీడీపీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, రేవంత్‌రెడ్డి, సీనియ ర్ రిటైర్డ్ ఇంజనీర్ నారాయణ, జర్నలిస్టు ఎన్.వేణుగోపాల్ తదితరుల అభ్యంతరాలకు వివరణలు ఇచ్చిన డిస్కంలు... విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయాయి.

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top