మురుగంతా రోడ్లపైకే..

మురుగంతా రోడ్లపైకే.. - Sakshi


- కుప్పలు తీయరు..  మోరీలు క్లీన్ చేయరు..

- సంగారెడ్డి పట్టణంలో వెదజల్లుతున్న దుర్గంధం

సంగారెడ్డి మున్సిపాలిటీ:
చూసేందుకు రోడ్లున్నా.. మురికి నీరు పోవడానికి కాల్వలున్నా వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే మురుగునీరంతా రోడ్లపైకే వస్తోంది. పట్టణంలోని శాంతినగర్, కల్వకుంట, మార్క్స్‌నగర్, విజయనగర్‌కాలనీ, ఇంద్రాకాలనీలలో మున్సిపల్ సిబ్బంది మురికి కాల్వను శుభ్రం చేశారు. ఇందుకోసం కాల్వలో నుంచి మట్టిని, చెత్తను రోడ్లపై వేసి రోజులు గడుస్తున్నా ఇంత వరకు వాటిని తొలగించలేకపోయారు. దీంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు పందులు సంచరిస్తున్నాయి. మరో వైపు వర్షాలు కురియడంతో మురికి కుప్పలు మురిగి పోయి కాల్వల నుంచి వెదజల్లే దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని అయా కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుంట చౌరస్తా వద్ద 20 రోజుల క్రితం మురికికాల్వలను శుభ్రం చేశారు.



ఇక్కడ డ్రైనెజీలలో నుంచి తీసిన చెత్తను అక్కడే కుప్పలు వేశారు కానీ ఇంత వరకు వాటిని తొలగించలేకపోయారు.  గాలొస్తే చాలు చెత్తంతా కొట్టుకొచ్చి ఇండ్లలోకి వస్తోందని అంటున్నారు. గణేష్‌నగర్ లో సైతం మురికి కల్వలు లేకపోవడంతో పందులు సంచరించడం వల్ల కచ్ఛాకాల్వలు నేలమట్టమై మురికి నీరు రోడ్లుపైనే ప్రవహిస్తుంది. ఇంద్రాకాలనీలో సైతం డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కాలనీ లో ఒక్క రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి కాల్వలను శుభ్రం చేయడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు.  కొత్తగా సీసీ డ్రైన్‌లు నిర్మించలేకపోయిన కనీసం కచ్ఛాకాల్వలు ఏర్పాటు చేస్తే నీరు నిలువకుండా ఉంటుందని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోని పారిశుద్ధ్యంలోపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అయా కాలనీ వాసులు కోరారు.

 

కమిషనర్ వివరణ..

పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని ఆరోపణలున్నాయని ఇన్‌చార్జి కమిషనర్ గయాసొద్దీన్‌ను  వివరణ కోరగా మురికి కాల్వలలో తీసిన చెత్తను వెంటనే తొలగించేందుకు రాదని అందుకు తీసిన మూడు రోజుల తర్వాత తొలగిస్తారని తెలిపారు. వారం రోజులైనా తమ సిబ్బంది తొలగించకుంటే మాత్రం చర్యలు తీసుకుంటామని తెలిపారు.



Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top