పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు!


* ‘సాక్షి’తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి

* ఉద్యోగార్థులకు తెలంగాణపై అవగాహన ఉండాల్సిందే

* సిలబస్‌లో మార్పులపై నిపుణులతో కమిటీ వేస్తాం

* పోటీ పరీక్షల స్థాయినిబట్టి ప్రశ్నలుంటాయి

* ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లకుండా మరో సెల్

* నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్ల ప్రక్రియ వేగవంతం

* ఉద్యోగ నోటిఫికేషన్‌లోనే సమస్త వివరాలుంటాయి

* వీలైతే వచ్చేనెలలో ఏదైనా చిన్న నోటిఫికేషన్ ఇస్తాం



సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగం చేయబోయే ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర సామాజిక, రాజకీయ, భౌగోళిక అంశాలపై అవగాహన ఉండాల్సిందేనని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టంచేశారు. ఈ అంశాలన్నింటిపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలుంటాయని చెప్పారు. ఈ మేరకు పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు తెస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.



కమిషన్‌లో తీసుకురాబోయే సంస్కరణలు, నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించేందుకు చేపట్టబోయే చర్యలను సంస్కరణలను వివరించారు. ‘‘తెలంగాణలో ఉద్యోగం చేయబోయే వారికి ఇక్కడి చరిత్ర, సంస్కృతి, నైసర్గిక స్వరూపం తెలిసి ఉండాలి. ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు, ఉద్యమాలు, పోరాటాలు అన్నింటిపై కచ్చితమైన అవగాహన అవసరం. అవి తెలియకపోతే ఉద్యోగి తెలంగాణలోని ప్రజలకు సంపూర్ణ న్యాయం అందించలేరు. అందుకే పోటీ పరీక్షల్లో ఈ అంశాలన్నింటిపై ప్రశ్నలు ఉంటాయి. అందుకు సిలబస్‌లో మార్పులు తెస్తాం. అయితే పోటీ పరీక్ష స్థాయిని బట్టి ఈ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం.



ఇందుకోసం ప్రొఫెసర్లు, అధికారులు, కమిషన్ సభ్యులతో కూడిన ప్రత్యేక అకడమిక్ కమిటీని ఏర్పాటు చేస్తాం. బ్రిటిష్ కాలంలో ఐసీఎస్‌కు లండన్‌లో శిక్షణ ఏర్పాటు చేసినా ఉద్యోగం చేయాల్సిన భారతదేశానికి సంబంధించిన అంశాలపైనే శిక్షణ ఇచ్చేవారు. అలాగే తెలంగాణలో ఉద్యోగం చేయబోయే ప్రతి ఒక్కరికి తెలంగాణకు సంబంధించిన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాల్సిందే. అందుకోసమే సిలబస్‌లో మార్పులు తెస్తాం’’అని చక్రపాణి చెప్పారు. పలు అంశాలపై ఆయన ఏం చెప్పారంటే..



వారంలో సిలబస్ మార్పులపై కమిటీ

గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4 తదితర పోటీ పరీక్షల్లో పరీక్ష వారీగా సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ చేసే సిఫారసులను నెల రోజుల్లోగా తెప్పించుకొని అమల్లోకి తెస్తాం. పోటీ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నపత్రాల్లో అనువాద, అన్వయ దోషాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నోటిఫికేషన్ల వారీగా అర్హతలు, వివాదాలు తలెత్తనివిధంగా చేపట్టాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో అకడమిక్ సెల్‌ను ఏర్పాటు చేస్తాం. ప్రశ్నపత్రాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంది కనుక ఈ కమిటీ కాన్ఫిడెన్షియల్. ఏ పరీక్షలకు ఇంట ర్వ్యూలు ఉండాలి. ఏ పరీక్షలకు ఇంటర్వ్యూలు అవసరం లేదనే అంశాలను ఈ సెల్ చూస్తుంది. అంతేకాదు యూపీఎస్‌సీ తరహా పరీక్ష విధానాన్ని అమలు చేస్తాం. అందులో లోపాలుంటే తొలగించి మంచివి తీసుకుంటాం. భవిష్యత్తు పాలన ఈ లక్ష ఉద్యోగాల భర్తీపైనా ఆధార పడి ఉంటుంది కనుక జాగ్రత్తగా వ్యవహరిస్తాం.



ప్రతి పరీక్షకు కేలండర్

ఏటా నోటిఫికేషన్ల అంశానికి సంబంధించి కాకుండా, పరీక్ష వారీగా కేలండర్‌ను అమలు చేస్తాం. నోటిఫికేషన్‌లోనే పరీక్ష దరఖాస్తు తేదీ నుంచి చివరి తేదీ, హాల్‌టికెట్ల జారీ, రాత పరీక్ష, ఫలితాలు, పోస్టింగ్ ఇచ్చే తేదీలతో సహా కేలండర్‌ను జారీచేస్తాం. ఇదంతా ఆన్‌లైన్‌లోనే చేపడతాం. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఐదారు నెలల్లో ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేస్తాం. ఆన్‌లైన్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగుల వివరాలను సేకరిస్తాం. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారన్న స్పష్టమైన వివరాలు వస్తాయి.



సవాళ్లను అధిగమిస్తాం

మా ముందు మూడు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. పక్కా చర్యలతో వాటిని విజయవంతంగా అధిగమిస్తాం. కమిషన్ ఏర్పాటుతో ఇప్పటికే ఓ అడుగు ముందుకు పడింది. నిరుద్యోగుల్లో నమ్మకం వచ్చింది. ఇన్నాళ్లు ఉద్యమాల్లో ఉన్న వారు నోటిఫికేషన్ల జారీతో పోటీ పరీక్షల వైపు మళ్లేలా చూస్తాం. పారదర్శకంగా నియామకాలు చేపట్టి టీఎస్‌పీఎస్సీపై నమ్మకాన్ని కల్పిస్తాం. లక్ష ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వానికి అవసరమైన అర్హతలు, బాధ్యతలతో కూడిన వారిని అందిస్తాం.



వారి విషయంలో విధాన నిర్ణయం మేరకే..

కమిషన్ చేపట్టే నియామకాలన్నీ ప్రభుత్వ విధానపర నిర్ణయాల ప్రకారమే ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న యువత విషయంలో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్నే అమలు చేస్తాం. కమిషన్ విధానపర నిర్ణయాలు చేయదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top