ఇకనైనా మారండి


అది హైదరాబాద్‌లోని ఓ నివాసం. పాస్‌పోర్ట్ విచారణకు వెళ్లిన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నారాయణరావుకు ఆ ఇంటి పెద్దాయన రూ.1500 ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. దాన్ని కానిస్టేబుల్ సున్నితంగా తిరస్కరించడంతో మరో రూ.వెయ్యి కలిపి ఇవ్వబోయాడు. కానీ, సదరు కానిస్టేబుల్... తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచారని, వాటితో సంతృప్తిగా ఉన్నామని ఎలాంటి డబ్బులు వద్దని వారించాడు. లంచం డబ్బులు తిరస్కరించి ఆదర్శంగా నిలిచిన ఆయనను సీఎం కేసీఆర్ మరుసటిరోజు సన్మానించారు.

 

 ఉద్యోగులకు వేతనాలు భారీగా పెంచామని, బాధ్యతగా పనిచేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం సూచించారు. కానీ, మన జిల్లాలోని పలువురు అధికారులు ఇంకా ఆ కక్కుర్తి వీడడం లేదు. సామాన్యులను లంచం పేరిట పీడిస్తున్నారు. వేలకు వేలు వేతనాలు తీసుకుంటూ పనికో రేటు చొప్పున వసూలు చేస్తున్నారు. చివరకు రోజువారీ కూలీల డబ్బుల్లోనూ కక్కుర్తి పడి వేధిస్తున్నారు.    

 

 పెద్దపల్లి : ‘ఉద్యోగుల వేతనాలు పెంచితే అవినీతి ఆగుతుంది... ఇకపై ఎవరూ లంచం తీసుకోకుండా ప్రజలకు సేవలందించండి.... అన్న సీఎం కేసీఆర్ మాటలు పలువురు ఉద్యోగుల చెవికెక్కడం లేదు. పీఆర్సీతో అందరి వేతనాలు భారీగానే పెరిగినా... గడిచిన మూడు నెలల కాలంలో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ పరిధిలో 13 మంది అవినీతిపరులు పట్టుబడ్డారు.

 జిల్లాలో వారం రోజులకు ఓ అవినీతి ఉద్యోగి ఏసీబీకి పట్టుబడుతున్నారు.

 

 ఇంతకాలంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పలానా పనికి  ఇంత రేటు అంటూ ఉద్యోగులు డిమాండ్ చేసేవారు. పోలీస్‌స్టేషన్‌లో సివిల్ పంచాయితీల నుంచి క్రిమినల్ కేసుల వరకు నిందితులు, బాధితులు రెండు వైపులా ముడుపులు అందించాల్సిందే. రెవెన్యూలో అవినీతి బాగోతం గురించి చెప్పనక్కరనే లేదు. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు ఆ అవినీతి సొమ్ములో వాటా ఉంటుంది. అవినీతి ఆనవాళ్లు కనిపించే కొన్ని శాఖల గురించి చర్చిద్దాం.

 

 పోలీస్‌స్టేషన్ కథ

 గ్రానైట్ క్వారీలు, బ్రాంది షాపుల నుంచి భారీ నజరానాలు అందడం పరిపాటి. ఇక కాగితాల ఖర్చు నుంచి జీపు డీజిల్ వరకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే నిందితులు, బాధితులు భరించాల్సిందే. ప్రతి మండల పోలీస్‌స్టేషన్‌లో ఆటోడ్రైవర్లు, జీపు డ్రైవర్లు, ఫుట్‌పాత్ వ్యాపారులు ముడుపులతో జీపు ఖర్చు వెల్లదీస్తున్నారు. ఈవిషయం తెలిసిన ప్రభుత్వం ప్రతి పోలీస్‌స్టేషన్‌కు వాహనం కేటారుుంచింది. నిర్వహణ ఖర్చుల కింద పోలీస్టేషన్‌కు రూ.25వేలు, మున్సిపాలిటీ ఏరియా స్టేషన్‌కు రూ.75వేలు ప్రతి నెల చెల్లిస్తుంది. అరుునా వారు వెనకటి గుణమేలా మాన అన్నట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు.

 

 రెవెన్యూలో

 జిల్లాలో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఉద్యోగుల్లో 75శాతం మంది రెవెన్యూకు చెందినవారే. పహణీ నఖలు నుంచి పట్టాదారు పాసుబుక్కుల వరకు ప్రాజెక్ట్‌లు, గనుల్లో భూసేకరణ, పరిహారం చెల్లింపులో కింది నుంచి పైదాకా భారీ ముడుపులుంటాయి. వివాదాస్పద భూముల్లో తీర్పుల అమలుకు కాసుల వర్షం కురుస్తుంది. నగరపంచాయతీ, మున్సిపాలిటీలలో రియల్‌ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీ వాటాలు  అందుతుంటారుు. ఇల్ల నిర్మాణ  అనుమతులకు రూ.50 వేల నుంచి మొదలై ఇల్లును బట్టి రేట్లు మారుతుంటారుు. వారసత్వ వివాదాలుంటే ఇక పండుగే. ఏరియా బిల్ కలెక్టర్, కౌన్సిలర్ చివరికి మేయర్, కమిషనర్ల వరకు అమ్యామ్యాలు అందాల్సిందే. సెట్‌బ్యాక్‌లో గోల్‌మాల్, రోడ్ల నిర్మాణంలో వాటాలు చెప్పుకుంటే పోతే పెద్ద గ్రంథమే రాయవచ్చు.

 

 రోడ్లతో ఆర్‌ఆండ్‌బీకే లాభం

 గ్రామీణ రోడ్ల నుంచి ప్రధాన రోడ్లన్నీ ఆర్‌ఆండ్‌బి పరిధిలోనే ఉంటాయి. జిల్లాకు ఏ రూ.500కోట్ల విలువగల రోడ్లు ఆర్‌ఆండ్‌బీ కింద నిర్మాణమవుతాయి. ఆ శాఖకు నిధుల్లో రూ.7శాతం కమిషన్ వస్తుంది. అంటే ఏటా దాదాపు రూ.35లక్షల లంచం సొమ్ము వాటాగా వస్తుంటుంది.  వ ర్క్ ఇన్‌స్పెక్టర్ మొదలు హైదరాబాద్‌లో అధికారి వరకు వాటాలు ముట్టుతారుు.

 

 క్వాలిటీ విజిలెన్స్‌లో ఫిర్యాదు వస్తే పండుగే

 రోడ్లు భవనాల నిర్మాణంలో నాణ్యత లేదని రాజకీయ నాయకుల నుంచి ఒక్క ఫిర్యాదు వస్తే చాలు విజిలెన్స్ అధికారులకు పండుగే.. పండుగ. కాంట్రాక్టర్లు, విజిలెన్స్ అధికారుల మధ్య ఒప్పందంతో వాటాలు చేతులు మారుతుంటారుు.

 

 

 దీంతో నాణ్యత లేని పనులను సైతం ‘మస్త్’గా ఉందంటూ కితాబు ఇస్తారు. ఒకవేట అమ్యామ్యాలు అందకపోతే అభివృద్ధి పనిమీద నాణ్యతలేదని జరిమానా వేస్తారు. ఆ జరిమానాలో పర్సేంటేజీని బట్టి జరిమానా శిక్ష ఉంటుంది.

 వాణిజ్య పన్నుల శాఖతీరే వేరు

 వ్యాపారంలో చెల్లించే పన్నులో అధికారుల చేతుల్లో  బరువు పెడితే ప్రభుత్వానికి చెల్లించే భారం తగ్గుతుంది. ఇన్‌కం టాక్స్ దాడులన్నీ ముందే తెలుస్తాయి. సదరు వ్యాపారులకు వాణిజ్య పన్నుల శాఖ ఒప్పందాలన్నీ రహస్యంగా సాగుతాయి. ఇతరులకు బయటపడవు. అవినీతి ఆరోపణలు ఎక్కడా బయటకి కనిపించవు.  

 

 అంగన్‌వాడీ... కాదేది అనర్హం

 సమగ్రశిశు సంక్షేమశాఖ పాలనలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో కాదేది కక్కుర్తికి అనర్హం అన్నట్లు సాగుతుంది. నూనె ప్యాకెట్ నుంచి మొదలు పెడితే కోడిగుడ్ల వరకు కక్కుర్తి పడుడు. తనిఖీ కోసం ఉన్నతాధికారి వస్తే కందిపప్పు, శనగపప్పు అప్పగించి శాంతింపజేస్తారు.

 

 గండ్లు పడితే లాభాల జల్లే

 ఎస్సారెస్పీ అధికారుల లాభమంతా కాలువలకు పడ్డ గండ్లపైనే ఉంటుంది. ఏటా కాలువలు మరమ్మతు చేస్తుంటారు. బిల్లులు చేయడం చెల్లించడం ఆశాఖ చేస్తున్న పని. నీళ్లు రాకపోయినా నిధులు మాత్రం వస్తాయి. పనులు జరుగకపోవడంతో మిగతా శాఖలో 7, 8 శాతం ఉండగా ఎస్సారెస్పీలో 15 శాతం ముడుపుల కథ ఉంటుంది.

 

 ఇరిగేషన్ ఇదో పెట్ట పుట్ట

 ఇరిగేషన్‌శాఖ పరిధిలో చెరువులు ఉంటారుు. ఒక్కో చెరువు మరమ్మతుకు రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు నిధులు మంజూరవుతారుు. ఆ నిధుల్లో పావులా వంతు చెరువుకోసం ఖర్చుపెడితే మిగతాదంతా నొక్కేయడమే. అందులో సిబ్బంది నుంచి అధికారుల వాటాలు లెక్కేసి ఉంటారుు.  

 

 ఏసీబీకి పదును పెట్టాలి

 ఉద్యోగులకు ఆశించినదానికంటే మెరుగైన జీతాలు పెరిగాయి. అవినీతిపై ఏసీబీ దూకుడు పెంచాలి. ఇది ప్రజలంతా నేర్చుకోవాలి. ఏసీబీని విస్తరించి అవినీతి అధికారులు, ఉద్యోగులకు సంకెళ్లు వేయాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది.

 - కర్నె రాజు,  ఉపాధ్యాయుడు

 

 ఏసీబీ స్థాయిని పెంచినప్పుడే ప్రయోజనం

 ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ పనిచేయలేం. సిబ్బందిని పెంచాలి. సమాచారం కోసం ఆధునిక పరికరాలను అందించాలి. 2013లో 53, 2014లో 41, 2015లో ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేశాం. సత్వరంగా విచారణ జరిపి శిక్షలు వేయాలి. అప్పుడే అవినీతి తగ్గుతుంది. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లిస్తున్న ప్రతి పైసా ప్రజలదేనని వారు గుర్తించాలి. అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వెంటనే పట్టుకుంటాం. కొందరు అవినీతిపరులు ఉద్యోగాల సర్వీస్ నుంచి తొలగింపబడ్డారు.

 - సుదర్శన్‌గౌడ్,  ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top