సీఎం ‘సర్వే’తోనూతనోత్తేజం

సీఎం ‘సర్వే’తోనూతనోత్తేజం - Sakshi


మంచాల: ఫిలింసిటీ ఏర్పాటు కోసం రాచకొండ గుట్టల్లో భూములు పరిశీలించేందుకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏరియల్ సర్వే చేయడం స్థానిక ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపింది. సీఎం వస్తారనే సమాచారంతో జనం భారీ ఇక్కడికి సంఖ్యలో తరలివచ్చారు. దీంతో నిత్యం నిర్మానుష్యంగా ఉండే రాచకొండ పరిసర ప్రాంతం జనంతో కిటకిటలాడింది. పోలీసులు అడుగడుగునా తనిఖీలతో జనం రాకుండా వాహనాలను అడ్డుకున్నారు. అయినా ప్రజలు భారీ సంఖ్యలో  తరలివచ్చారు.   



మూడుసార్లు చక్కర్లు..

ఉదయం  11.40 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లోంచి దిగారు. నేరుగా సమీపంలోని వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ  రాచకొండ గుట్టలు, వాటి పరిసర  ప్రాంతాలకు సంబంధించిన వివరాలతో కూడిన మ్యాపులను పరిశీలించారు. 12-19 గంటలకు  రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలు హెలికాప్టర్‌పై రాచకొండ గుట్టలను  ఏరియల్ సర్వే చేశారు. అనంతరం   సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ, రంగారెడ్డి- నల్లగొండ జిల్లాల కలెక్టర్లు శ్రీధర్, చిరంజీవులుతో కలిసి 12-23 నుంచి 12-50 గంటల  వరకు ఏరియల్ సర్వే చేశారు.



హెలికాప్టర్‌లో ఇలా మూడుసార్లు చక్కర్లు కొట్టారు. తిరిగి వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిలో భోజనం చేశారు. అధికారులతో మాట్లాడి రాచకొండ గుట్టల విస్తీర్ణం, ప్రాముఖ్యత వంటి అంశాలపై 2-15 గంటల దాకా  చర్చించారు. తిరిగి 2-20 గంటలకు  మరోసారి ఏరియల్ సర్వే చేసి తిరిగి వెళ్లిపోయారు. రాచకొండ గుట్టల్లో ముఖ్యమంత్రి 2 గంటల 40 నిమిషాలు గడిపారు.

 

పోలీసుల భారీ బందోబస్తు..

రాచకొండ గుట్టల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ చేయనుండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. రాచకొండ ముఖ ద్వారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో  తిప్పాయిగూడ గ్రామం నుంచే వాహనాలు రాకుండా నిలిపివేశారు. సీఎం వేదిక వద్దకు మీడియా ప్రతినిధులను అనుమతించ లేదు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top