మహానాడుకు ‘సాక్షి’ రావద్దట

మహానాడుకు ‘సాక్షి’ రావద్దట - Sakshi


ఆహ్వానించరాదంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు

 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ‘సాక్షి’పై తన అక్కసు ప్రదర్శించారు. బుధవారం నుంచి నిర్వహిస్తున్న మహానాడు సమావేశాలకు ‘సాక్షి’ మీడియా గ్రూపుపై నిషేధం విధించారు. సాక్షి గ్రూపు మీడియా సంస్థల ప్రతినిధులకు పాసులు జారీ చేయవద్దని పార్టీ మీడియా కమిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. టీడీపీ గత రెండేళ్లుగా సాక్షి మీడియా గ్రూపు ప్రతినిధులను ఏ సమావేశానికి అనుమతించడం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు కూడా రాకుండా సాక్షిని నిషేధించారు.

 

 అయితే ఈ విషయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని నోటీసులు జారీ చేయడంతో అప్పటినుంచి అధికారిక కార్యక్రమాలకు మాత్రం అనుమతినిస్తున్న విష యం తెలిసిందే. కానీ పార్టీపరంగా నిర్వహించే కార్యక్రమాలకు ఇప్పటికీ అనుమతివ్వడం లేదు. నిజానికి ఏ రాజకీయ అయినా పార్టీ రాజ్యాంగ పరిధిలో ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951లోని సెక్షన్ (29ఎ)కు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. వ్యతిరేక వార్తలు రాస్తున్నారన్న ఏకైక కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అశేష పాఠకాదరణ పొందిన పత్రికను రానివ్వకుండా అడ్డుకోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పనిగట్టుకుని వ్యతిరేక వార్తలు రాసినప్పటికీ పత్రికల విషయంలోనూ గతంలో ఏ ముఖ్యమంత్రీ ఈ రకంగా సమావేశాలకు రానివ్వకుండా నిషేధం విధించలేదు. సాక్షి ఆవిర్భావం నుంచి ఆధారాలు చూపిస్తూ ప్రజల పక్షాన నిలుస్తూ వార్తలు రాసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక వ్యవహారాలపై సాక్షి నిక్కచ్చిగా వార్తలు రాయడం సహించలేకనే మహానాడుకు ఆహ్వానించలేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

 

 అప్రజాస్వామికం

 ‘సాక్షి’ మీడియాతో పాటు మరో మీడియా సంస్థ మీద టీడీపీ విధించిన నిషేధాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వివిధ పాత్రికేయ సంఘాలు డిమాండు చేశాయి. అధికార పార్టీ తనకు నచ్చని మీడియాపై ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని స్పష్టం చేశాయి. మహానాడు వార్తలను కవర్ చేయనీయకుండా కొన్ని మీడియా సంస్థలను నిషేధించడాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి.

 

 పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం

 అధికారం పార్టీ  ఇలా కొన్ని మీడియా సంస్థలను కవరేజికి రాకుండా అడ్డుకునే చర్యలకు పూనుకోవడం అప్రజాస్వామికమే కాదు. ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించడమే. చంద్రబాబు ఇప్పటికైనా ఈ విషయంపై పునరాలోచన చేయాలి.

 - కె శ్రీనివాసరెడ్డి, ఐజేయూ నేత

 

 నిషేధాన్ని ఉపసంహరించుకోవాలి

 రాజకీయ పక్షాల మధ్య వైరుధ్యాలుంటే రాజకీయంగా తేల్చుకోవాలేగానీ పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం తగదు. మహానాడు సందర్భంగా సాక్షి పత్రిక, ఛానల్‌తోపాటు మరో మీడియా సంస్థను కవరేజికి రాకుండా నిషేధించడం నియంతృత్వ పోకడకు నిదర్శనం. ఈ నిషేధాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.

 - దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రెటరీ జనరల్

 

 ప్రజల హక్కును కాలరాయడమే

 మీడియా సంస్థలను  కవరేజికి రానీయకపోవడం సబబు కాదు. ఇది ఆ మీడియా సంస్థల పాఠకుల హక్కులను కాలరాయడ మే. నిషేధాన్ని ఉపసంహరించుకోవాలి.

 - కె.అమర్‌నాథ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు

 

 ఇవేనా బాబు చెప్పే నీతులు?

 టీడీపీ అధ్యక్షుడు కూడా అయిన సీఎం చంద్రబాబు ఇటీవల విశాఖపట్నం పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతులు చెప్పారు. ఇలాంటి వ్యక్తి కొన్ని మీడియా సంస్థలపై నిషేధించడం దారుణం.

     - ధర్మారావు, ఏపీయూడబ్ల్యూజే, అధ్యక్షుడు

 దారుణం..

 నచ్చని మీడియా సంస్థల విషయంలో చంద్రబాబు వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా కొన్ని మీడియా సంస్థలను కవరేజికి రాకుండా ఉండేలా చేయడం దారుణం.

 - ఐవీ సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top