డీసీఎంఎస్ రాజకీయాలు..


చైర్మన్ పదవిని ప్రభావితం చేసిన నిర్మల్ రాజకీయాలు

అధికారికంగా పదవి కోల్పోయిన ఐర నారాయణరెడ్డి

వచ్చేనెల 4న చైర్మన్ ఎన్నిక    పదవి కోసం టీఆర్‌ఎస్‌లో ముసలం


 

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు.. అనే నానుడికి డీసీఎంఎస్ రాజకీయా లు నిలువెత్తు నిదర్శనంగా మారాయి. గతంలో నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆశీస్సులతోనే డీసీఎంఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న ఐర నారాయణరెడ్డి.. ఇప్పుడు తన పదవిని వదులుకునేలా తెరవెనుక జరిగిన ప్రయత్నాల్లో ఇదే ఇంద్రకరణ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒకప్పుడు ఇంద్రకరణ్‌రెడ్డికి ముఖ్య అనుచరుల్లో నారాయణరెడ్డి ఒకరు. 2005లో జరిగిన ఎన్నికల్లో నారాయణరెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ పదవి దక్కడంలో ఐకేరెడ్డి కీలకంగా వ్యవహరించారు.



ఆ తర్వాత నిర్మల్ రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఐకే రెడ్డి రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డికి ఈ నారాయణరెడ్డి దగ్గరవడం.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా నారాయణరెడ్డి ఐకేరెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. తీరా ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఇంద్రకరణ్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తుండటంతో నారాయణరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎలాగైనా నారాయణరెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గేలా ఇంద్రకరణ్‌రెడ్డి తెరవెనుక పావులు కదిపారు.



డీసీఎంఎస్ డెరైక్టర్లను నెల రోజులకు పైగా క్యాంపులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎట్టకేలకు శుక్రవారం జరిగిన సమావేశంలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నారాయణరెడ్డి పదవిని అధికారికంగా కోల్పోయారు. తన అనుచరుడిని పదవీగండం నుంచి గట్టెక్కించేందుకు మహేశ్వర్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకవేళ నారాయణరెడ్డికి పదవి దక్కినా అధికారంలో టీఆర్‌ఎస్ ఉండటంతో డీసీఎంఎస్‌కు రానున్న రోజుల్లో వ్యాపార లావాదేవీలేవి జరిగే అవకాశం లేదు.



మార్కెటింగ్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఏ కాంట్రాక్టు కూడా డీసీఎంఎస్‌కు దక్కే అవకాశాలు ఉండవు. పదవి దక్కినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావించిన నారాయణరెడ్డి గురువారమే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఈ రాజీనామా పత్రాన్ని కమిషనరేట్‌లో ఇవ్వాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారం శుక్రవారం డీసీఎంఎస్ సమావేశాన్ని నిర్వహించిన సహకార శాఖ అధికారులు ఆ తంతును ముగించారు.



తూర్పు, పశ్చిమ నేతల మధ్య పోటీ..

అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఖాళీ అయిన డీసీఎంఎస్ చైర్మన్ పదవి కోసం తూర్పు, పశ్చిమ జిల్లా నేతల మధ్య పోటీ నెలకొంది. చైర్మన్ పదవి రేసులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకు తాంసి మండలం జామిడి పీఏసీఎస్ చైర్మన్ వినోద్‌రెడ్డి పేరు వినిపించినా, తీరా ఇప్పుడు చైర్మన్ ఎన్నిక తేదీ ఖరారయ్యాక ఈ పదవి తమకు కావాలంటూ తూర్పు జిల్లాకు చెందిన మరో డెరైక్టర్ ముందుకొచ్చారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ పదవి పశ్చిమ జిల్లాకు కేటాయించగా, డీసీఎంఎస్‌ను తూర్పు జిల్లాకు కేటాయించాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఒకరిద్దరు పట్టుబడుతున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.



ఇప్పటివరకు క్యాంపుల నిర్వహణకు అయిన ఖర్చును కూడా భరించేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. అలాగే తమకు అనుకూలంగా ఓటేసే డెరైక్టర్లకు పెద్ద మొత్తంలో నజరానాలు ముట్టజెప్పేందుకు నేతలు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటంతో అధికార టీఆర్‌ఎస్‌లోనే రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. వచ్చే నెల 4న జరుగనున్న చైర్మన్ ఎన్నిక రోజు ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశాలున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top