సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ పాత్ర కీలకం

సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ పాత్ర కీలకం


హైదరాబాద్‌: సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందని కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ అధ్యక్షుడు జస్టిస్‌ డాక్టర్‌ సతీశ్‌చంద్ర అన్నారు. గురువారం నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 74వ సెంట్రల్‌ ఎక్సైజ్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ సతీశ్‌చంద్ర మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారుల పట్ల అధికారులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచిం చారు. జీఎస్టీ బిల్లును ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, ఆ బిల్లు మంచి ఫలితాలను అందిస్తుందని ఆశిద్దామని అన్నారు. ఒలంపిక్‌ రజత పతక గ్రహీత పి.వి. సింధు మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు ప్రచారకర్తగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఎంపిక తన భవిష్యత్‌పై మరింత బాధ్యతను పెంచిం దన్నారు. కమిషనర్‌ సందీప్‌ ఎం. భట్నాగర్‌ మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లు రావడంతో అధికారుల్లో ఆందోళనగా ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేసినట్లు తెలిపారు. పన్ను వసూళ్లలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top