ఉద్యానానికి ఊతం

ఉద్యానానికి ఊతం


తునికిబొల్లారంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రం

రూ.12 కోట్లతో వంద ఎకరాల్లో విస్తరిస్తాం

పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం

వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి


 


సాక్షి, సంగారెడ్డి:  ఉద్యాన పంటలకు ఊతమిచ్చే విధంగా ములుగు మండలంలోని తునికిబొల్లారంలో రూ.12 కోట్ల వ్యయంతో వంద ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ, ఉద్యానవనశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్రంలో తెలంగాణలోని పది జిల్లాల ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ అధికారులకు నిర్వహించిన ఒకరోజు సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఉద్యాన శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ హెచ్‌యూ వైఎస్ ఛాన్సలర్ బీఎంసీ రెడ్డి పాల్గొన్నారు.



ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పండ్లతోటల పెంపకంలో రైతులకు సమగ్ర అవగాహన, శాస్త్ర పరిశోధనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా తునికి బొల్లారంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉద్యాన సాగులో వెనుకబడి ఉన్న తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  శాస్త్ర పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి వారికి ఆర్థికంగా లబ్ధిచేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డిలోని ఫల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కీలకభూమిక పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యాన సాగులో చిన్న రైతులను కూడా ప్రోత్సహిస్తామన్నారు.   



అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే పండ్ల తోటల పెంచేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను కోరారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, తెలంగాణలోని ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలన్నారు. పండ్లతోటలు సాగు చేసే రైతులు క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. జామ, నేరెడు పండ్ల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. త్వరలోనే రైతులకు భూసార హెల్త్‌కార్డులు అందజేస్తామన్నారు.



ఉద్యానవనశాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌కు జిల్లా దగ్గరగా ఉన్నందున రైతులు కూరగాయలు, పండ్ల మార్కెటింగ్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు కూరగాయలు, పండ్లు సాగు చేయాలని సూచించారు. వైఎస్సార్ హెచ్‌యు వైస్ చాన్సలర్ బీఎంసీ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలోని వాతావర ణం కూరగాయలు, పండ్ల సాగుకు అనుకూలంగా ఉంటుందని, అయితే రైతులకు అధిక దిగుబడి ఇచ్చే మేలైన పండ్ల రకాలు ఎంచుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులకు మంచి ఆదాయం సమకూరుతుందన్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా పండ్లతోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ అధికారులకు సూచించారు.

 

ప్రోత్సాహకాలు ఇవ్వండి: రైతుల వినతి

పండ్ల తోటల సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం కల్పించాలని సదస్సులో పాల్గొన్న పలువురు రైతులు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లాకు చెందిన నరేశ్‌రెడ్డి మాట్లాడుతూ, పండ్లతోటల సాగుకు అవసరమైన సబ్సిడీలు ఇవ్వాలని, డ్రిప్ ఇరిగేషన్ నిబంధనలను సడలించాలని, రైతులు తాము కోరిన వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసే సౌలభ్యం కల్పించాలని కోరారు.



ఖమ్మం జిల్లాకు చెందిన రైతు గంగారెడ్డి మాట్లాడుతూ, అరటి సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. మరో రైతు జనార్దన్ మాట్లాడుతూ, కార్బైడ్ అవసరం లేని విధంగా మామిడి పండ్లను మగ్గించేందుకు అవసరమైన చిన్నపాటి గోదాంల నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు. దీనిపై మంత్రి పోచారం స్పందిస్తూ, పండ్ల తోటలు సాగు చేసే రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సదస్సులో ఉద్యానవనశాఖ జేడీ వెంకటరామిరెడ్డి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి రామలక్ష్మి,  జేడీఏ హుక్యానాయక్, పశుసంవర్థకశాఖ జేడీ లక్ష్మారెడ్డి, పది జిల్లాల ఉద్యానవనశాఖ అధికారులు ఫల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top