బాబోయ్.. మాటగాళ్లు

బాబోయ్.. మాటగాళ్లు


 వర్గల్: సెల్‌ఫోన్ ద్వారా ఆ యువకునితో మాటలు కలిపారు. కారు చవకకే ఖరీదైన సెల్‌ఫోన్ అంటూ ముగ్గులో దింపారు. మాటల గారడీతో నమ్మించారు. పోస్టులో పార్సిల్ ద్వారా ఫోన్ పంపుతున్నాం..డబ్బులు కట్టి విడిపించుకో అని సూచించారు. తీరా పార్సిల్ విప్పితే అందులో ఫోన్ లేదు..పనికిరాని కాగితాలు, ఓ స్టీల్ గొలుసు, లాకెట్ తప్ప.. ఈ మోసపూరిత సంఘటన శనివారం వర్గల్ మండల కేంద్రంలో వెలుగు చూసింది. బాధితుడు వర్గల్‌కు చెందిన కిష్టనోల్ల షాదుల్లా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం షాదుల్లా సెల్‌ఫోన్‌కు హెచ్‌టీసీ కంపెనీ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేశారు. తమ కంపెనీకి చెందిన రూ.12,500 విలువైన సెల్‌ఫోన్‌ను లాటరీ ద్వారా నీకు రూ. 3,500 లకే లభిస్తుందని చెప్పారు.



మాటల గారడీతో అతనిలో ఆశలు కలిగించారు. ఆ వ్యక్తులు పోస్టు ద్వారా సెల్‌ఫోన్‌ను పార్సిల్‌గా పంపుతామని అడ్రసు తీసుకున్నారు. పార్సిల్ రాగానే రూ. 3,500 చెల్లించి విడిపించుకోవాలని సూచించారు. ఈ మేరకు షాదుల్లా పేరిట ఓ పార్సిల్ వచ్చింది. వర్గల్ పోస్టాఫీసుకు శుక్రవారం వెల్లిన షాదుల్లా డబ్బు కట్టేసి పార్సిల్‌ను అక్కడే తెరచి చూశాడు. ఖరీదైన ఫోన్‌కు బదులు అందులో నుంచి పనికిరాని కాగితాలు, ఓ స్టీల్ లాకెట్, గొలుసు బయటపడ్డాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు శనివారం గౌరారం పోలీసులకు బాధితుడు షాదుల్లా ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ మోసగాళ్లే కాదు..మాటగాళ్లూ ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top