ఆంధ్ర వేతనం మాకొద్దు


భద్రాచలం : తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన మండలాల్లో ఉద్యోగుల వివరాల సేకరణ కోసం బుధవారం భద్రాచలం వచ్చిన తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారులను ఇక్కడి ఉద్యోగులు అడ్డుకున్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆంధ్ర అధికారులను పంపివేయటంతో వివాదం సద్దుమణిగింది. విలీన మండలాల్లో పాలనపై పట్టు సాధించే క్రమంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల వివరాల సేకరణకు సిద్ధమైంది.



ఉద్యోగుల జీతభత్యాల విషయమై సమగ్ర వివరాలను పంపించాలని డీడీవోలను  నాలుగు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఇందులో భాగంగా  ఉద్యోగుల వివ రాల సేకరణ కోసం తూర్పు గోదావరి జిల్లా నుంచి కొంతమంది అధికారులు బుధవారం అన్ని మండలాలకొచ్చారు. నెల్లిపాక మండలానికి సంబంధించిన ఉపాధ్యాయుల వివరాల కోసం తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారులు భద్రాచలం వచ్చినట్లు తెలుసుకున్న ముంపు మండలాల ఫోరం కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, సమన్వయకర్త స్వరూప్ కుమా ర్, రాజు, రామాచారి, ధనికొండ శ్రీనివాస్ నేతృత్వంలో వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు అక్కడికి చేరుకుని వివరాల సేకరణకు వచ్చిన ఆంధ్ర అధికారులు వెంటనే వెళ్లిపోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు.



 ‘ఆంధ్ర జీతంవద్దు-తెలంగాణ జీతమే ముద్దు’ అనే నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగుల వివరాల సేకరణ కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఉద్యోగుల ఆప్షన్ల విషయం తేల్చకుండా వివరాల సేకరణ కోసం ఎలా వస్తారని ఆంధ్ర అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆప్షన్ల మేరకు విలీన మండలాల్లో ఉన్న ఉద్యోగలను వెంటనే బదిలీ చేయాలని, ఆ తర్వాతే ఆంధ్ర అధికారులు ముంపు మండలాల్లో పర్యటించాలని ఘోరావ్ చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త పరి స్థితులు ఏర్పడ్డాయి.  విషయం తెలుసుకున్న భద్రాచలం పట్టణ ఎస్సై మురళి తన సిబ్బం దితో అక్కడికి చేరుకున్నారు.



తూర్పుగోదావరి జిల్లా అధికారులతో చర్చించారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో వివరాలు సేకరించకుండానే ఆంధ్ర అధికారులు వెనుదిరిగారు. ఉద్యోగుల వివరాల కోసం వచ్చిన అధికారులకు చింతూరులోనూ చుక్కెదురైంది. అధికారులు నిర్వహించిన సమావేశాన్ని ఉద్యోగులు బహిష్కరించారు. వీఆర్‌పురంలోనూ ఉద్యోగులు నిరసనకు దిగారు. కూనవరంలో ఉద్యోగులు తమ వివరాలు ఇచ్చినప్పటికీ ఆప్షన్ల మేరకు వెంటనే బదిలీ చేయాలంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top