క్యాష్‌లెస్ ఆసరా!

క్యాష్‌లెస్ ఆసరా! - Sakshi


- లబ్ధిదారులందరికీ ‘రూపే’ కార్డులిప్పించాలని

- సెర్ప్ నిర్ణయం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు ప్రత్యేక డ్రైవ్

 

 సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఆసరా పథకాన్ని ‘క్యాష్‌లెస్’ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35.96 లక్షలమంది లబ్ధిదారులు ఉండటం, వీరికి ప్రతినెలా రూ.397 కోట్లు పింఛన్లుగా పంపిణీ చేయాల్సి రావడంతో అధికారులు క్యాష్‌లెస్ ఆసరా దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెల పింఛన్ పంపిణీకే నగదు కొరత ఏర్పడినందున, భవిష్యత్తులో నగదు (పింఛన్)పంపిణీకి మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత నెల రోజులుగా పింఛన్ల పంపిణీ జరుగుతున్నప్పటికీ సరిపడా కొత్తనోట్లు లభించక మొత్తం సొమ్ములో రూ.130 కోట్లను సెర్ప్ సిబ్బంది నేటికీ పంపిణీ చేయలేకపోయారు. అధికారిక లెక్కల ప్రకారం వివిధ జిల్లాల్లో 11 కోట్ల మంది లబ్ధిదారులు తమకు అందాల్సిన అక్టోబర్ నెల పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.



 ఆసరా లబ్ధిదారులకు రూపే కార్డులు

 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.96 లక్షలమంది లబ్ధిదారుల్లో ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు కలిగిన 13.63 లక్షల మందికి ప్రతినెలా పింఛన్ సొమ్మును వారి ఖాతాలకే ప్రభుత్వం జమ చేస్తోంది. మరో 17.81లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా పింఛన్ సొమ్మును అందజేస్తుండగా, ఇంకా గ్రామాల్లోని 4.52 లక్షలమందికి ఎటువంటి ఖాతాలు లేకపోవడంతో పంచాయతీ సిబ్బంది ద్వారా పింఛన్ సొమ్మును చేతికి అందజేస్తున్నారు. అరుుతే, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలున్న వారికీ డెబిట్ కార్డులు లేకపోవడంతో వారు కూడా నగదును తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాలు లేని లబ్ధిదారులకు సమీప బ్యాంకు, పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిపించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులు నిర్ణరుుంచారు. ఆ మేరకు మొత్తం ఆసరా లబ్ధిదారులందరికీ రూపే కార్డులు ఇప్పించి పింఛన్ సొమ్మును కూడా క్యాష్ లెస్ లావాదేవీల్లో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.



 ఉపాధిహామీ కూలీలకు ఇదే విధానం

 ఉపాధిహామీ  కూలీలకు కూడా బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల ద్వారానే వేతన సొమ్మును చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు, ఉపాధిహామీ పథకం చెల్లింపులకు నగదు కొరత, క్యాష్‌లెస్ లావాదేవీల కోసం చేపట్టాల్సిన చర్యల గురించి గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల, పోస్టాఫీసుల ప్రతినిధులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సమీక్షించనున్నట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top