అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత


 జగదేవ్‌పూర్ : అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం గుట్టు రట్టయింది.. ఇన్నాళ్లూ  రేషన్ బియ్యంతో వ్యాపారం చేస్తూ పేదలపొట్ట కొడుతున్న వ్యాపారులకు కళ్లెంపడింది. రేషన్ బియ్యంతో దందా చేస్తూ లక్షలకు పడగలెత్తిన వ్యాపారి రెడ్ హ్యండ్‌గా  దొరికాడు.  సుమారు 15 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి లారీలో లొడు చేస్తున్న సమయంలో స్థానిక తహశీల్దార్ పరమేశం రెడ్‌హ్యాండెడ్‌గా దాడి చేసి, షాపును సీజ్ చేశారు. ఈ సంఘటన ఎక్కడో కాదు స్వయంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న జగదేవ్‌పూర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యం వ్యాపారం గుట్టుగా కొనసాగుతోంది. జిల్లా సరిహద్దు ప్రాంతంలో  ఉండడంతో అధికారులు  చూసీ చూడనట్లు వ్యవహరిస్తారనే ఉద్దేశంతో జగదేవ్‌పూర్‌లో కొంత మంది వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేయడం, అమ్మడం ప్రారంభించారు.

 

  జగదేవ్‌పూర్ మండలంతో పాటు, వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాలు, నల్గొండ జిల్లా తుర్కపల్లి, రాజాపేట మండలాల నుంచి, రంగారెడ్డి జిల్లా  సరిహద్దు గ్రామాల నుంచి కొందరు గిరిజనులు ఊరురా తిరుగుతూ రేషన్ బియ్యం సేకరిస్తూ మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో కొంత మంది వ్యాపారుల వద్ద కిలో రూ. 10ల చొప్పున విక్రయించేవారు. అయితే చట్ట ప్రకారం రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా నేరం. అయితే  ఇక్కడి వ్యాపారులకు మాత్రం చట్టం చుట్టమే.

 

 ఎలా పట్టుకున్నారంటే..

 జగదేవ్‌పూర్‌లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానిక తహశీల్దార్ పరమేశంకు సమాచారం అందడంతో బుధవారం ఉదయం జగదేవ్‌పూర్ వచ్చారు. అక్కడ రోడ్డు పక్కనే బుద్ద చిన్న సత్యం దుకాణం వద్ద లారీలో బియ్యం లోడు చేస్తూ కనిపించడంతో అక్కడి వెళ్లారు. పరిశీలించి చూడగా అవి రేషన్ బియ్యంగా తేలింది.  అప్పటికే లారీలో 60  క్వింటాళ్ల బియ్యం లోడు చేసి ఉంది. అలాగే దుకాణంలో తనిఖీలు చేయగా రాసి పోసిన బియ్యంతో పాటు సంచులలో బియ్యం కనిపించాయి. వెంటనే వాటిని కూడా సీజ్ చేశారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని మొత్తం తహశీల్దార్ సీజ్ చేశారు.

 

 వ్యాపారి జిమ్మక్కులు..

 అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక  తహశీల్దార్ పట్టుకొవడంతో సదరు వ్యాపారుడు అవి రేషన్ బియ్యం కావని.. మొత్తం నూకలంటూ తప్పించకునే ప్రయత్నం చేశాడు. అయితే బియ్యన్ని పరిశీలించి చూడగా కొన్ని నూకలు, పసుపు కలిపిన బియ్యంగా తహశీల్దార్ గుర్తించారు.  జగదేవ్‌పూర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు వ్యాపారికి వత్తాసు పలికే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో వ్యాపారి లొడు చేసిన లారీని తప్పించే ప్రయత్నం చేశారు.

 

 వెంటనే తహశీల్దార్ పరమేశం లారీని వెంటనే ఇక్కడికి తీసుకరావాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో లారీని ఘటన స్థలానికి రప్పించారు. దీంతో పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని గదిలోనే ఉంచి సీజ్ చేశారు. ఒకే లారీలో 60 క్వింటాళ్ల బియ్యం, గదిలో 60 పైగా రేషన్ బియ్యం పట్టుబడడంతో ఇవి ఒకే వ్యాపారికి చెందినవా.. లేక మరికొందరు దీని వెనుక ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తహశీల్ధార్ పరమేశం మాట్లాడుతూ నమ్మ దగిన సమాచారం మేరకే దాడి చేసి రేషన్ బియ్యన్ని పట్టుకున్నట్లు  తెలిపారు. పట్టుకున్న బియ్యంలో కొన్ని నూకలు, పసుపు కలిసిన బియ్యం ఉన్నట్లు చెప్పారు. సంగారెడ్డి ప్రాంతంలో బీరు కంపెనీలకు తరలిస్తున్నట్లు తెలిసిం దని వివరించారు. పట్టుకున్న బియ్యన్ని ఫోరెన్సిక్‌కు పంపించినట్లు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top