రెండుచోట్ల పిడుగుపాటు ఇద్దరు సజీవ దహనం


 కొప్పురాయి (టేకులపల్లి): ఏజెన్సీలో దారుణం జరిగింది. పిడుగుపాటుతో ఇద్దరు సజీవంగా దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పురాయి పంచాయతీలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన సోలెం బుచ్చిరాములు-పొట్టెమ్మ, కుంజా ముత్తయ్య-పుల్లమ్మ, చింత లక్ష్మయ్య-కల్యాణి దంపతులు బర్లగూడెం సమీపం లోని అటవీ ప్రాంతంలో కొన్నేళ్ళుగా సాగు చేసుకుంటున్నారు.



రోజులాగానే వీరు మంగళవారం ఉదయం చేను వద్దకు వెళ్లారు. పొట్టెమ్మ, ముత్తయ్య మాత్రం వెళ్లలేదు. చేను వద్ద పని చేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో, దగ్గరలోని గుడిసెలోకి కుంజా పుల్లమ్మ(40), సోలెం బుచ్చిరాములు(33), చింత లక్ష్మయ్య, చింత కల్యాణి తలదాచుకున్నారు. కొద్దిసేపటి తరువాత, సరిగ్గా ఆ గుడిసెపై భారీ శబ్దంతో పిడుగు పడి, మంటలు లేచాయి.



గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో చిక్కుకుని కుంజా పుల్లమ్మ(40). సోలెం బుచ్చిరాములు(33) సజీవంగా దహనమయ్యారు. శబ్దం వినపడగానే చింత కల్యాణి బయటకు పరుగెత్తింది. కాలిపోతున్న గుడిసెలో ఉన్న తన భర్త లక్ష్మయ్యను రక్షించేందుకు వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చింది. తన వద్దనున్న కండువాను లక్ష్మయ్య కాళ్ళకు చుట్టి గట్టిగా బయటకు లాగి దూరంగా తీసుకెళ్లింది. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



 రాజారాం తండాలో కూడా...

 రాజారాంతండాలోని చేనులో కూడా పిడుగు పడింది. అక్కడికి సమీపంలో అరక కట్టడానికి సిద్ధమవుతున్న పిడుగు ప్రభాకర్ అనే రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన ప్రదేశాలను బోడు ఎస్‌ఐ ముత్తా రవికుమార్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి ఎస్‌ఐ తరలించారు.



 రెండు గ్రామాల్లో విషాధం

 ఈ విషాద ఘటనలతో కొప్పురాయి పంచాయతీలోని ఒడ్డుగూడెం, మోదుగులగూడెం గ్రామా ల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోలెం బుచ్చిరాములు ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన పొట్టెమ్మను వివాహమాడి ఇల్లరికం వచ్చాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండో పాప సుమత మానసిక, శారీరక వికలాంగురాలు. పెద్ద పాప స్పందన నాలుగో తరగతి చదువుతోంది. మూడో పాప సాత్వికకు రెండేళ్ళు.



 చింత పుల్లమ్మ స్వగ్రామం మోదుగులగూడెం. భర్త ముత్తయ్యతో కలిసి వ్యవసాయం చేస్తోంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top