అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ


 తిరుమలగిరి

 తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకపోతుండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో వెనుకబడ్డారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్  విమర్శించారు. శుక్రవారం తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం మొత్తం అంధకారంగా మారుతుందని ఆంధ్ర నాయకులు అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.

 

  సబ్ స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంత రైతులకు లోఓల్టేజి సమస్య తీరుతుందని తెలిపారు. నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కోరారు. గతంలో వేసవి కాలంలో గ్రామాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండడంతో సెలవుల్లో ఊర్లకు రావాలంటే పట్నంవాసులు భయపడే వారన్నారు. కానీ ఇప్పుడు పల్లెల్లో కోతలు లేకపోవడంతో పట్నం వాసులంతా పల్లెబాట పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు పేరాల పూలమ్మ, పీఏసీఎస్ చైర్మన్ జి.అశోక్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మల్లయ్య, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ భిక్షపతి, డీఈ శ్రీనివాస్, ఏడీఈ శ్రీరాములు, తహసీల్దార్ దశరథ, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, ఏడీ గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఉప్పలయ్య, రఘునందన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top