బిల్ట్ దుస్థితికి యాజమాన్యమే కారణం


  • కార్మిక నాయకుల మండిపాటు

  • కమలాపురంలో బహిరంగ సభ

  • పాల్గొన్న కార్మికులు, వారి కుటుంబాలు

  • కమలాపురం : యాజమాన్యం కుట్రల కారణంగానే బిల్ట్ పరిశ్రమకు ఈ దుస్థితి పట్టింది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్మాగారా న్ని తెరిపించేలా చర్యలు తీసుకోవాలని ట్రేడ్ యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు. అండగా ఉంటాం.. అధైర్యపడవద్దని కార్మికులకు భరోసా ఇచ్చారు. గురువారం కమాలాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.



    ఈ సందర్భంగా బిల్ట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పలువురు నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. కర్మాగారంలో దారపు మిల్లును ఏర్పాటు చేయాలని, లేఆఫ్ ఆలోచన మానుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం సభలో నాయకులు మాట్లాడుతూ కార్మికులు పని చేయకనో, నష్టాలు రావడంతోనో కర్మాగారం మూతపడలేదని, యాజమాన్యం మార్కెట్‌లో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేతకాకనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.



    ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమతో 33 ఏళ్లుగా సుమారు రూ.3వేల కోట్లు కూడబెట్టిన సంస్థ శ్రమజీవులకు కాలుష్యాన్ని, అనారోగ్యాలను వదిలి బ్రిటీష్ పాలనను మరిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభా లు వచ్చినప్పుడు కార్మికులకు పంచని సంస్థ నష్టాల సాకుతో కార్మికులను ఇబ్బందులు పెట్టడం ఏమిటన్నారు. కార్మికులంతా నా గుండెపైనే ఉన్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు ఒక పక్క ఉపాధి కోల్పోయి రోడ్డుతున్నా కనిపించడంలేదాని అని ప్రశ్నించారు.



    జిల్లాలో భారీ పరిశ్రమగా వెలుగొందుతున్న బిల్ట్ కర్మాగారంపై సుమారు 20వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, పరిశ్రమను పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొన్నారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలు, ఇతర సంఘాలను కలుపుకుని కర్మాగారం తెరిపించే వరకూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిం చారు.



    కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఓంపెల్లి పురుషోత్తమరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి మారుతీరావు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంకే.బోస్, బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లట్టి జగన్మోహన్‌రావు, కార్యదర్శి పెంట శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చాగంటి కిషన్, బిల్ట్ జేఏసీ నాయకులు, కార్మికులు, వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top