‘బడ్జెట్’ వాయిదా

‘బడ్జెట్’ వాయిదా - Sakshi


సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ తొలి వారంలోతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

 

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభించాలని ముందు నిర్ణయించినప్పటికీ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ కోణంలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు, విధానాలు రూపొందించిన తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, అలాగే మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక కూడా పూర్తయ్యే దాకా ఆగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి అనుమతి కూడా తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాల వాయిదాతోపాటు పలు అంశాలపై దాదాపు గంటన్నరకు పైగా గవర్నర్‌తో కేసీఆర్ చర్చలు జరిపారు.

 

 కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి ఆరు నెలల వరకు బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదిస్తే సరిపోతుందని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందని, ఇందుకు ఆర్డినెన్స్ కూడా అక్కర్లేదని, అందువల్ల బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయడానికి అవకాశం ఉందని గవర్నర్‌కు సీఎం వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అప్పటి శాసనసభ ఆమోదించింది. అందులో తొలి ఆరు నెలల కాలంలో  వ్యయానికి సభ అనుమతినిచ్చింది. ఈలోగా తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కావడంతో.. అపాయింటెడ్ డే అయిన జూన్ రెండో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నాలుగు నెలల కాలానికి అన్ని రకాల వ్యయాల కోసం తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 26 వేల కోట్ల రూపాయలను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి గవర్నర్ కేటాయించారు. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం మరో రెండు నెలల బడ్జెట్‌ను కూడా కేటాయించే అధికారం గవర్నర్‌కు ఉండడంతో.. ఈ వెసులుబాటు ఆధారంగా బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయొచ్చని అధికారులు వివరించారు.

 

 కాగా, ఇటీవలి తన సింగపూర్ పర్యటన విశేషాలను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలనూ గవర్నర్‌కు సీఎం వివరించినట్లు సమాచారం. విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారుల కేడర్ విభజన అంశాన్ని కూడా కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకునివచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు ఆలస్యమవుతున్నకొద్దీ ప్రభుత్వ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయని, త్వరగా ఈ విభజన పూర్తయ్యేలా చూడాలని కోరినట్లు సమాచారం. కాగా, దాదాపు నెలన్నర నుంచి బడ్జెట్‌పై కసరత్తు పూర్తి చేశాక.. ఇప్పుడు కొత్తగా మళ్లీ టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి, వాటి నివేదికల ఆధారంగా బడ్జెట్ రూపొం దించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం మొదట్లోనే ఆలోచిస్తే.. అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడానికి వీలయ్యేదని చెబుతున్నారు. అలాగే సెప్టెంబర్ 30లోగా బడ్జెట్ ఆమోదం పొందితే 14వ ఆర్థిక సంఘం కూడా తన నివేదికలో రాష్ట్రానికి ఎంతమొత్తం నిధులు కేటాయించవచ్చన్న స్పష్టతనిస్తుందని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ఆర్థిక సంఘం అంచనా మాత్రమే వేస్తుందని, దాని ఆధారంగా నిధుల కేటాయింపు సక్రమంగా ఉంటుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top