పేద విద్యార్థులకు వరం

పేద విద్యార్థులకు వరం - Sakshi


► జిల్లాకు బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల మంజూరు

► 50సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

► తాత్కాలికంగా పాలమూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసే అవకాశం

► అధిక ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సు బీఎస్సీ నర్సింగ్‌

► హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు




మహబూబ్‌నగర్‌ క్రైం:  జిల్లాలో బీఎస్సీ నర్సింగ్‌  కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త కళాశాల ఏర్పాటుకు జీఓలు విడుదల చేసింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో పాలమూరు వైద్య కళాశాల ఉన్న నేపథ్యంలో దీనికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే జిల్లా కేటాయించిన నర్సింగ్‌ కళాశాలలో 50బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు ఉండే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు ఒక్కటి కూడా ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల లేదు. కొత్తగా మంజూరైన కాలేజీ పాలమూరు పేద విద్యార్థులకు ఒక వరంగా మారనుంది.



ప్రధానంగా జిల్లాలో చాలా వరకు పేద, మధ్య తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో నర్సింగ్‌ విద్యను అభ్యసించనున్నారు. వీరంతా ప్రైవేటుగా చదువుకుంటున్నారు. ఈ కోర్సు మొత్తం నాలుగున్నర ఏళ్ల పాటు ఉంటుంది దీంట్లో వార్షిక పరీక్షలతో పాటు ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి. కొన్నేళ్ల నుంచి జిల్లాలోని విద్యావంతులు, విద్యార్థులు నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నతులు ఇస్తూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి జిల్లాకు నర్సింగ్‌ కళాశాల మంజూరు చేయడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



ఈ కోర్సుకు డిమాండ్‌: ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు అధిక స్థాయిలో డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో జిల్లాలో నూతనంగా కళాశాల ఏర్పాటుతో దీనికి మరింత క్రేజ్‌ పెరగనుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కోర్సులలో సీట్లు దొరకని విద్యార్థులు చాలా మంది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి లక్షల రూపాయలు చెల్లించి చదువుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోనే కొత్తగా కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వలస పోవడం తప్పడంతో పాటు ఖర్చులు కూడా తగ్గనున్నాయి.



కొత్త కళాశాలలో ఒక ఏడాది తర్వాత సీట్లు పెరగనున్న నేపథ్యంతో జిల్లాకు చెందిన చాలా వరకు పేద విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. జిల్లాకు నూతనంగా కేటాయిం చిన బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలలో భారత నర్సింగ్‌ మండలి(ఐఎన్‌సీ) నిబంధనల ప్రకారం 40నుంచి 60సీట్లు ఉంటే ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, మరో ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. దీంతో పాటు 13నుంచి 18మంది ట్యూటర్లు ఉండాలి. అదేవిధంగా పరిపాలన విభాగంలో కూడా కొంత మంది ఉద్యోగులు అవసరం ఉంటారు. దీంతోపాటు కళాశాల నిర్మాణానికి, ప్రొఫెసర్ల నియామకం, సిబ్బంది ఏర్పాటు, నిధుల కేటాయింపుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.



వైద్యకళాశాలలో

జిల్లా కేంద్రంలోని పాలమూరు వైద్య కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా పరిపాలన భవనం, హస్టల్‌ భవనం, తరగతుల నిర్వహణ కోసం ప్రత్యేక తరగతి గదిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి మెడికల్‌ కళాశాలలో తాత్కాలికంగా కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎదిర సమీపంలో శాశ్వతంగా భవన నిర్మాణాలు, వసతి గృహాలు తదితరాలపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు పాలమూరు వైద్య కళాశాలలో నిర్వహిస్తున్నట్ల తెలుస్తోంది.మరోవైపు వైద్య కళాశాలలో భవనాల కొరత ఉందని పట్టణంలో ఏదైన కళాశాలను తాత్కాలికంగా అద్దెకు తీసుకుని దాంట్లో కొన్నాళ్లు నడిపించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ కళాశాలకు ఎలాంటి సిబ్బందీ లేకపోవడంతో కొత్తవారిని నియమించే వరకు ఎలాంటి పనులూ ప్రారంభమయ్యే అవకాశం లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top