ఉపాధ్యాయ విద్యలో బీసీలే అత్యధికం

ఉపాధ్యాయ విద్యలో బీసీలే అత్యధికం


సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన వర్గాలు(బీసీ) ఉపాధ్యాయవిద్యలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఎడ్‌) కోర్సులను అభ్యసిస్తున్నవారిలో 67 శాతం బీసీలు, ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాల వారీగా, వివిధ కోర్సులను అభ్యసిస్తున్నవారి వివరాలను బీసీ కమిషన్‌ విద్యాశాఖ నుంచి సేకరించింది. గత ఏడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాసినవారిలోనూ బీసీలే అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. టెట్‌కు హాజరైన వారిలో 58.99 శాతం బీసీలుండగా, ఆ తరువాత 18.77 శాతంతో రెండో స్థానంలో ఎస్సీ అభ్యర్థులు ఉన్నట్లు తేల్చింది. పరీక్షకు మొత్తంగా 3,40,567 మంది హాజరైతే అందులో బీసీలు 2,00,922 మంది ఉండటం గమనార్హం.



85 శాతం గ్రామీణ ప్రాంతాల వారే..

ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న వారిలో 85 శాతం మంది అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయ విద్యపై ఆసక్తి చూపుతున్న వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తక్కువేనని పేర్కొంటున్నారు. అందులోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులే ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా త్వరగా జీవితంలో స్థిరపడవచ్చన్న భావనే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇంటర్మీడియట్‌ తరువాతే డీఎడ్‌ చేసే అవకాశం ఉన్నందునా ఎక్కువ కాలం చదివే అవకాశంలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డీఎడ్‌ పూర్తి చేసి ప్రభుత్వ రంగం లేదా ప్రైవేటు రంగంలో స్థిరపడవచ్చన్న భావనే ఇందుకు కారణమని చెబుతున్నారు.



టెట్‌లో అర్హత సాధించిన ఓసీలు 10 శాతమే

ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఓసీలే తక్కువగా అర్హత సాధిస్తుండగా, ఎస్సీల్లో ఎక్కువ అర్హత శాతం ఉంది. ఎస్సీల తరువాత ఎస్టీలు ఎక్కువ శాతం అర్హతను సాధిస్తున్నారు. బీసీలు తక్కువ అర్హత పొందుతున్నారు. అయితే ఇందుకు కారణం అర్హత మార్కుల విధానమే. అర్హత మార్కుల విధానం ఓసీలకు 60 శాత, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం ఉంది. గత ఏడాది నిర్వహించిన టెట్‌లో ఓసీలు 10 శాతం మందే అర్హత సాధించగా, బీసీలు 29.40 శాతం మంది, ఎస్సీలు 53.68 శాతం మంది, ఎస్టీలు 38.22 శాతం మంది అర్హత సాధించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top