వ్యాపారి దారుణ హత్య

వ్యాపారి దారుణ హత్య - Sakshi

  • మాట్లాడుకుందామని పిలిచి దారుణం

  • కుటుంబ కలహాలే కారణం?

  • పహాడీషరీఫ్: దుండగులు ఓ వ్యాపారిని కత్తులతో అతిదారుణంగా నరికి చంపారు.  కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.....రాజేంద్రనగర్ శాస్త్రిపురానికి చెందిన బిన్ పీస్ కాలనీకి చెందిన మహ్మద్ జబ్బార్ కుమారుడు మహ్మద్ అబ్దుల్ రఫిక్ (28) జల్‌పల్లి పిట్టలగూడ సమీపంలో డైమండ్ స్టీల్ అండ్ రోలింగ్ షట్టర్స్ దుకాణాన్ని నడుపుతున్నాడు.



    కాగా ఇతనికి ఇప్పటికి మూడు వివాహాలు జరిగాయి. 2011లో మొదటి భార్య మృతి చెందడంతో రఫిక్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తర్వాత  రెండో పెళ్లి చేసుకున్న రఫిక్ ఆమెను కూడా వదిలేసి...మూడో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం మూడో భార్య వద్ద ఉంటున్నాడు. రోజు మాదిరిగానే రఫిక్ బుధవారం ఉదయం తన దుకాణానికివెళ్లాడు.



    మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు వ్యక్తులు ఆటోలో  వచ్చి... మాట్లాడాలని రఫిక్‌ను బయటికి రమ్మన్నారు. అతను తన బుల్లెట్ వాహనంపై వారి ఆటో వెనుకే కొద్ది దూరం వెళ్లాడు. దాదాపు 300 మీటర్ల దూరంలో కొందరు మద్యం తాగుతూ కత్తులతో సిద్ధంగా ఉన్నారు. వారి వద్దకు వెళ్లి ఆటో ఆగింది.



    వెనుకే వెళ్లిన రఫిక్ ప్రమాదాన్ని పసిగట్టి తన వాహనాన్ని వెనక్కి తిప్పి పారిపోయేందుకు యత్నించాడు. అంతలోనే దుండగులు  రఫిక్‌ను అడ్డుకొని.. చెట్ల పొదల్లోకి లాగి కత్తులతో దాడి చేశారు.  గొంతు కోసి, ముఖంపై కత్తులు, జాంబియాతో నరికి చంపేశారు. అనంతరం ఒక కత్తి, ఒక జాంబియాను అక్కడే పడేసి పారిపోయారు.  కాగా ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండటంతో ఈ దారుణాన్ని ఎవరూ చూడలేకపోయారు. సాయంత్రం 4 గంటలకు అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.



    శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. మృతునికి ఇప్పటికే మూడు వివాహాలు కావడాన్ని బట్టి కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హతుడు ఫ్యాక్టరీ నిర్వహిస్తుండటంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top