అమ్మా బైలెల్లినాదో...


ఆలేరు (నల్గొండ జిల్లా) : ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రజలు పల్లెల్లో ఉన్న గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగకు ఊరూ,వాడా ఒక్కటై అంగరంగ వైభవంగా అమ్మవార్లకు బోనం సమర్పించి మెక్కులప్పజెప్పడం అనాదిక తెలంగాణ సంప్రదాయంలో ముడివేసుకున్న బంధం. అన్ని పండుగల కన్నా ఈ బోనాల పండుగను చాలా ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢమాసం వచ్చిన తరువాత మొదట గోల్కొండ బోనాలతో ప్రారంభమై హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజ బోనాలతో సంబరాలు ముగుస్తాయి.



గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో గ్రామదేవతలు



ప్రతి గ్రామంలో 5 నుండి 10 వరకు గ్రామదేవతల దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయలకు గ్రామంలో ప్రత్యేకంగా పూజారులు అమ్మవార్లకు ధూప,దీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు. గ్రామాల్లో గ్రామదేవతలు దుర్గమ్మ, ఎల్లమ్మ, పోశమ్మ, మైస్మమ్మ, నల్లపోచమ్మ, కట్టమైసమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, మారెమ్మ, పోలేరమ్మలను గ్రామాలల్లో భక్తులు దేవాలయల్లో కొలువుంచుకొన ప్రత్యేక పూజలు చేస్తుంటారు.



ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి



ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆషాఢమాసంలో దేవిని భక్తిశ్రద్ధలతో పూజించుకొని,  తన సొంత బిడ్డ పుట్టింటికి వచ్చిందనే భావనతో ప్రేమానురాగాలతో మహిళలు చీరెలు, సారెలు, రకరకాల పూలతో పూలమాలలు అల్లి అమ్మవారికి వేసి, బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.



బోనం అంటే ఏంటి ?



బోనం అంటే భోజనం.  జానపదులు తమకు ఇష్టమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడమే బోనం. వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్ని మార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ బోనాన్ని మట్టి లేదా రాగి కుండలలో తయారు చేస్తారు.





బోనాల పండుగ సాగే తీరు



బోనాల పండుగ రోజుల్లో గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలన్నీ మామిడి కొమ్మలు, అరటి మండలు, దీపాల కాంతులతో అలంకరిస్తారు. అమ్మవారికి బోనం వండడానికి ఎక్కువగా మట్టి కుండలే వాడుతుంటారు. కొత్తకుండను తెచ్చి, కట్టెల పొయ్యి మీద బోనం వండడం ఆనవాయితీ. బోనం వండిన తరువాత బోనం కుండను శుభ్రం చేసి సున్నం రాసి, పసుపు,కుంకుమలతో అలంకరిస్తారు. తరువాత బోనం కుండ మీద దీపం కంచుడు పెట్టి దాని చుట్టూ పూలమాలను అలకరించి వేప కొమ్మలను బోనానికి పెడతారు.



అమ్మవారి ఘటం



అమ్మవారి ఆకారంలో అలకరించబడ్డ రాగి కలశాన్ని ఘటం అంటారు. గ్రామాల్లో ఒంటిపై పసుపు పుసుకొని పూజారులు ఈ ఘట్టాన్ని మోస్తారు.ఈ ఘట్టాన్ని పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం అయ్యే వరకు డప్పులు, మేళతాళల మధ్య ఉరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తరువాత జరుగుతుంది.



అమ్మవారికి నైవేద్యం



మహిళలు ఉరేంగింపుగా తీసుకువచ్చిన బోనాన్ని దేవాలయ ప్రాంగణం ముందు రాసిగా పోస్తారు. దాన్నే రతి అని పిలుస్తారు. రతి మీద కుంకుమ, పసుపు చల్లి అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించి భక్తులు మెక్కులు, ముడుపులు చెల్లించుకుంటారు.



భవిష్యవాణి



అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించిన తరువాత భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శివసత్తులు అమ్మవారి పూనకంతో ఈ భవిష్యవాణిని చెబుతుంటారు. భక్తులు వారి స్ధితిగతులు గ్రామ పట్టణ, దేశ స్ధితిగతులను అడుగుతుంటారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top