బోగస్ రుణాలకు ‘లోన్చార్జ్’తో చెక్


కొత్త విధానాన్ని రూపొందించిన సీసీఎల్‌ఏ

ఆమోదం తెలిపిన బ్యాంకులు

వచ్చే ఖరీఫ్ నుంచి అమలు




సాక్షి, హైదరాబాద్ : బోగస్ పట్టాదారు పుస్తకాలతో అక్రమంగా వ్యవసాయ రుణాలను పొం దుతున్న వారిని నియంత్రించేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపట్టింది. ‘లోన్ చార్జ్’ మోడల్(రుణ ధ్రువీకరణ విధానం) పేరిట భూపరిపాలన ప్రధాన కమిషనర్ రూపొందించిన కొత్త పద్ధతికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో పాటు రిజర్వ్‌బ్యాంక్ ప్రతినిధులు ఆమోదం తెలి పారు. దీంతో వ్యవసాయ రుణాల మంజూరు ప్రక్రియకు..భూ రికార్డుల్లో ఏర్పడుతున్న గందరగోళానికి, ఒకే వ్యక్తి ఒకే పట్టాపై పలు బ్యాం కుల్లో రుణాలు పొందడం, నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాల హల్‌చల్..


వంటి అక్రమచర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని  రెవెన్యూ ఉన్నతాధికారులు అంటున్నారు. రెవెన్యూశాఖ ఇటీవల రూపొందించిన వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా పంట రుణం పొందే పట్టాదారు వివరాలు(పహాణీ, పట్టాదారు..తదితర)ను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు గానీ, రుణమిచ్చే బ్యాంకు అధికారులు గానీ ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకునేందుకు వీలుకలుగుతుంది. రుణం కోరుతు న్న రైతు రకరకాల ధ్రువీకరణపత్రాలను తీసికెళ్లే పని లేకుండా తన వ్యక్తిగత గుర్తింపు కార్డును బ్యాంకుకు తీసికెళ్తే చాలు, ఆన్‌లైన్‌లో వివరాలను పరిశీలించి బ్యాంకు అధికారులు వెంటనే రుణమంజూరు చేసేలా ‘లోన్‌చార్జ్’  వినియోగపడనుంది.


తీసుకున్న రుణం వివరాలు సదరు రైతు పహాణీలోనూ అప్‌డేట్ అవుతుంది. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలోనూ వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఆర్‌బీఐ అధికారులు ఈ మోడల్ పట్ల సానుకూలతను వ్యక్తం చేశారు. పట్టాదారునిపై లోన్‌చార్జ్‌ను రూపొందించడం ద్వారా ప్రభుత్వం నుంచే అందాల్సిన లబ్దిని అర్హులకు మాత్రమే అందించేందుకు వీలవుతుందని ఆర్థిక, వ్యవసాయ శాఖల అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. త్వరలోనే పెలైట్ ప్రాజెక్ట్‌ను అమలు చేసి, వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి పూర్తిస్థాయిలో ‘లోన్‌చార్జ్’ మోడల్‌ను అమలు చేయాలని సీసీఎల్‌ఏ నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top