‘ఒక్కరొస్తేనే వణుకుతున్నారు.. ముగ్గురొస్తే..’

‘ఒక్కరొస్తేనే వణుకుతున్నారు.. ముగ్గురొస్తే..’ - Sakshi


హైదరాబాద్‌: తెలంగాణలో 2019లో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా రంగంలోకి దిగనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయన పర్యటించి ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ విలేకరులకు చెప్పారు. ‘ఒక్క అమిత్‌షా వస్తేనే టీఆర్‌ఎస్‌ పార్టీ వణికిపోతుంది. అదే ముగ్గురు నాయకులు తెలంగాణలో ప్రచారం చేస్తే ఏం జరుగుతుంది?’ అని ప్రశ్నిస్తూ ఆ ఇద్దరు నాయకులు మరెవరో కాదని ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అని చెప్పారు.



‘ఇదే ఏడాది సెప్టెంబర్‌లో తెలంగాణలో అమిత్‌షా ఆరు రోజులుపాటు పర్యటించనున్నారు. ఆ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాని నరేంద్ర మోదీ వస్తారు’అని ఆయన విలేకరులకు చెప్పారు. బీజేపీలో మోదీకున్నంత హవా దాదాపుగా యోగికి ఉందన్న విషయం యూపీ ఎన్నికల్లో తేలిపోయింది. ఈ నేపథ్యంలో యోగిని తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ప్రచారానికి దింపాలని తెలంగాణ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ‘మోదీ, షా, ఆదిత్యనాథ్‌ హిందీలో మాత్రమే మాట్లాడతారు. అయినప్పటికీ వారు తెలంగాణ ప్రజలపై ప్రభావం చూపగలరని మేం నమ్ముతున్నాం’ అని లక్ష్మణ్‌ చెప్పారు.



వాస్తవానికి ఏపీ, తెలంగాణలో యోగితో ప్రచారం చేయించాలని భావించినప్పటికి ప్రస్తుతం తెలంగాణ విషయంలో మాత్రం స్పష్టత వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో కనీసం 20 సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top