సొంత డబ్బా తప్ప.. ప్లీనరీలో ఏముంది: బీజేపీ


సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప రైతుల ఆత్మహత్యలు, అకాల వర్షాల నష్టం గురించి ప్రస్తావించలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమద్రోహులు, ఫిరాయింపుదారులతో టీఆర్‌ఎస్ నిండిపోయిందన్నారు. ఉద్యమంపై ఉక్కుపాదం మోపి, ఆత్మ బలిదానాలకు కారణమైన దుర్మార్గులతోనే అమరవీరులకు సంతాపతీర్మానం పెడితే వారి ఆత్మలు ఘోషిస్తాయన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బీజేపీ, టీడీపీ ఓట్లతో గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరడం నీతి బాహ్యమైన చర్య అన్నారు.

 

  వారికి చేతనైతే తమ పదవులకు రాజీనామాచేసి ఏ పార్టీలోనైనా చేరాలని బీజేపీ నేతలు సవాల్ చేశారు. సబ్‌ప్లాన్ ప్రస్తావన లేకుండా ప్లీనరీలో సొంతడబ్బా కొట్టుకున్నారని చింతా సాంబమూర్తి విమర్శించారు. ఢిల్లీలో ఎర్రకోటకు దీటుగా గోల్కొండ కోటలో జెండాను ఎగురేయడమే అభివృద్ధా? అని ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి మాట్లాడకుండా.. టీఆర్‌ఎస్ నేతలు అవన్నీ తమ గొప్పలుగా చెప్పుకున్నారని విమర్శించారు. రైతులు కరువుతో, అకాలవర్షాలతో తల్లడిల్లిపోతుంటే ఘనంగా ప్లీనరీ జరుపుకోవడమంటే.. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో చక్రవర్తిలా కేసీఆర్ తీరుందని విమర్శించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top