మాఫియాదారులకే బంగారు తెలంగాణ

మాఫియాదారులకే బంగారు తెలంగాణ


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజం



 హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం భూకబ్జాదారులు, ఇసుక, మైనింగ్ మాఫియాదారుల కోసం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్లగొండ జిల్లా బీజేపీ సభలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తీవ్రంగా గాయపడి కంచన్‌బాగ్ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బరిశెట్టి శంకర్‌ను గురువారం ఆయన పరామర్శించారు. శంకర్‌కు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శంకర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం కిషన్‌రెడ్డి ఆస్పత్రి వద్ద విలేకర్లతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసైన్డ్ భూములను కబ్జా చేసి ఇతరులకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజ్‌పల్లి గ్రామంలో ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసి విక్రయించారని.. దీనిని శంకర్ రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.



తనకు న్యాయం జరగకపోవడంతో మనస్తాపానికి గురైన శంకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తన ఆవేదనను వ్యక్తం చేశాడని చెప్పారు. పాలకులు భూఅక్రమాలను ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి చర్యలపై సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. కేశరాజ్‌పల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించి శంకర్ కోరిక మేరకు ఆంజనేయస్వామి ఆలయం నిర్మించేందుకు సహకరిస్తామన్నారు. కాగా, కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్‌ను నల్లగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. మరోవైపు అధికార టీఆర్‌ఎస్ పార్టీ అరాచకాలు పెరిగిపోతున్నాయని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన నల్లగొండ పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది.      

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top