పౌల్ట్రీకి ఫ్లూ దెబ్బ


గంగాధర : బర్డ్‌ఫ్లూ భయంతో బాయిలర్ కోళ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. కిలో రూ.70 ఉన్న కోడి ధర నాలుగు రోజుల్లోనే రూ.56కు పడిపోయింది. ఫలితంగా రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. రైతులకు కోళ్ల పెంపకం ఓ జూదంలా మారింది. ఈ బ్యాచ్ కాకపోతే మరో బ్యాచ్‌కైనా కలిసిరాకపోతుందా? అని కోళ్లు పెంచుతూ నష్టపోతున్నారు. కోళ్ల రైతులను బర్డ్‌ఫ్లూ భయం నిండా ముంచుతోంది.

 

 జిల్లాలో 500 మంది రైతులకు 35 లక్షల సామర్థ్యం గల బాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. గంగాధర మండలంలో జిల్లాలోనే అత్యధికంగా ఐదు లక్షల బాయిలర్ కోళ్లు అమ్మకానికి ఉన్నాయి. బర్డ్‌ఫ్లూ భయంతో ధరలు పడిపోగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోనున్నారు. జిల్లాలో గంగాధర, రామడుగు, తిమ్మాపూర్, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, గోదావరిఖని, హుజూరాబాద్, సిరిసిల్ల, కొడిమ్యాల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కోళ్ల ఫారాలు ఉన్నాయి.

 

  ప్రస్తుతం ఫారంలో 45 నుంచి 50 రోజులపాటు కోడి పెంపకానికి అయ్యే ఖర్చు రూ.150 ఉంటుంది. 45 రోజులు పెరిగిన కోడి రెండు నుంచి రెండున్నర కిలోల బరువు తూగుతుంది. అయినా ఒక కోడి అమ్మితే రైతులకందేది రూ.110 నుంచి రూ.120 మాత్రమే ఉంటోంది. కిలో కోడి ధర రూ.56 నుంచి రూ.58 పలుకుతోంది. ఈ ధరతో కోడి అమ్ముకుంటే ఒక్కో కోడిపై రూ.30 నుంచి రూ.40, వెయ్యి కోళ్లకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు మునగాల్సిందే. వీటికి తోడు కనీసం పది శాతం కోళ్లు పెంపకం సమయంలో చనిపోతుంటాయి. ఈ నష్టం కూడా భరించాల్సిందే.

 

 వ్యాధులు ప్రబలకుంటేనే లాభాలు

 కోళ్లకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటేనే కోడికి రూ.40 నష్టపోతున్న రైతులు... వ్యాధులు సోకితే మరింత నష్టపోవాల్సిందే. కోళ్లకు ఎక్కువగా బర్డ్‌ఫ్లూ, ఇకోలాయి, ఆర్డీ, ఫీయార్డీ వంటి వ్యాధులు సోకుతుంటాయి. వీటితో కోళ్లు లెక్కనేనన్ని మరణిస్తాయని రైతులు పేర్కొంటున్నారు.

 

  వెన్‌కాబ్ ప్రతిరోజు ప్రాంతాల వారీగా ప్రకటించే మద్దతు ధరతో ట్రేడర్లు కొనుగోలు చేస్తారు. జిల్లాలోని వెన్‌కాబ్ మద్దతు ధర కిలో రూ.70 అయితే కొనుగోలు చేస్తున్నది రూ.56 నుంచి రూ.58 మాత్రమే. ఇతర ప్రాంతాల్లో వెన్‌కాబ్ వారు ప్రకటించిన మద్దతు ధర పరిశీలిస్తే పూణేలో కిలో రూ.54, చిత్తూర్ 78, నెల్లూర్ 85, బెంగ్లూర్‌లో 75, హైదరాబాద్‌లో 70, విజయవాడ 65, గుంటూరులో 72 రూపాయలు పలుకుతోంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top