ఇక అన్ని పురపాలికల్లో బయోమెట్రిక్!

ఇక అన్ని పురపాలికల్లో బయోమెట్రిక్! - Sakshi


హాజరు నమోదులో అక్రమాలకు చెక్  తప్పనిసరి చేసిన పురపాలక శాఖ

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని నగర, పురపాలికల్లో బయోమెట్రిక్ విధానంలో ఉద్యోగుల హాజరు నమోదును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రెగ్యులర్‌తో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హాజరును సైతం బయోమెట్రిక్ పద్ధతిలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్‌ను బాధ్యులుగా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ సంచాలకుడు బి.జనార్దన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు శనివారం ఆదేశాలు జారీ చేశారు.

 

 వాస్తవానికి ఈ బయోమెట్రిక్ విధానాన్ని గత జూలై 1 నుంచే అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ, చాలా పురపాలికలు ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తక్షణమే బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదును ప్రారంభించకపోతే నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్‌లకు తాజాగా హెచ్చరికలు జారీ అయ్యాయి.  

 

 అడిగే వారు లేరని ..

పురపాలికల్లో కార్యాలయ పనివేళల అమలు విషయంలో ఇష్టారాజ్యం నడుస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా రాకపోకలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విషయంలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తు న బోగస్ కార్మికుల పేర్లమీద వేతనాలను కొల్లగొట్టడం, గైర్హాజరైన కార్మికులను హాజరైనట్టుగా నమోదు చేసి డబ్బులు తీసుకోవడం వంటివి జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top