స్కూళ్లలో బయోమెట్రిక్

స్కూళ్లలో బయోమెట్రిక్ - Sakshi


- రాష్ట్ర సర్కార్ నిర్ణయం

- సన్నబియ్యం పక్కదారి పట్టకుండా..

- ‘మధ్యాహ్న భోజనం’ బియ్యంపై నిఘా

- సన్నబియ్యం కొన్నా.. అమ్మినా నేరం

- త్వరలోనే పాఠశాలల్లో అమలు

- జిల్లాకు 500లకు పైగా మిషన్లు


 

సాక్షి, మంచిర్యాల : ప్రభుత్వ.. ఎయిడెడ్ పాఠశాలలు.. వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనానికి సంబంధించిన సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. మొన్నటి వరకు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, హాస్టళ్లలో రెండు పూటలు విద్యార్థులకు దొడ్డు బియ్యంతో అన్నం వడ్డించిన ప్రభుత్వం జనవరి నుంచి సన్నబియ్యం సరఫరా చేస్తున్న విష యం తెలిసిందే. ఇప్పటి వరకు చాలా పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు స్కూళ్లకు గైర్హాజరైనా.. వసతి గృహాల్లో విద్యార్థులు లేకున్నా హాజరుతో సంబంధం లేకుండా పలువురు హెచ్‌ఎంలు, వార్డెన్లు తప్పు డు నివేదిక తయారు చేసి బియ్యం బుక్కేశారు. బయటి వ్యక్తులు సైతం ఈ భోజనాలు తింటున్న విషయా లు ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.



ఈ క్రమంలో స్కూళ్లు, హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి సన్నబియ్యంతో అన్నం తినే విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జిల్లా విద్యాశాఖాధికారులు, ఉప విద్యాధికారులతో సమావేశం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ పథకానికి సంబంధించిన సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కూళ్లు, హాస్టళ్లకు సరఫరా అవుతున్న సన్నబియ్యం ఎవరైనా కొన్నా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు.



జిల్లాలో 3,850 పాఠశాలలు.. 52 కేజీబీవీలు, 112 వసతి గృహాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో 4.90 లక్షల మంది విద్యార్థులకు 1,800 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తోంది. పాఠశాలల్లో 3.60 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటుంటే.. హాస్టళ్లలో సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులు రెండు పూటలు భోజనం చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 100 గ్రాముల బియ్యం, 6-10 విద్యార్థులకు 150 గ్రాములు, వసతి గృహాల విద్యార్థులకు రోజుకు 425 గ్రాముల చొప్పున బియ్యం అందిస్తోంది.

 

పర్యవేక్షణ సంగతేంటి..

మధ్యాహ్న భోజన పథక పర్యవేక్షణకు సంబంధించి ప్రభుత్వం మార్చి 10, 2011లో జీవో 21 విడుదల చేసింది. ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు రోజూ కనీసం ఒక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం రుచి చూడడంతోపాటు పాఠశాల, పరిసర ప్రాంతాల పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించింది. ప్రతీ 15 రోజులకోసారి నివేదిక  తెప్పించుకుని తమకు పంపాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోకు సూచించింది. పథక పర్యవేక్షణ బాధ్యత ఎంఈవోలపైనే ఎక్కువ ఉందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నెలకోసారి మండల స్థాయిలో జరిగే స్టీరింగ్, మానిటరింగ్ కమిటీలో మద్యాహ్న భోజనంపైనా చర్చించాలని సూచించింది.



కానీ అధికారుల అలసత్వం, ప్రభుత్వ ఉదాసీన వైఖరితో అది అమలుకు నోచుకోవడం లేదు. భోజనం తినే విద్యార్థుల వివరాలు, హాజరు శాతం, బియ్యం నిల్వలు, బిల్లులు, విజిట్ చేసి రాసిన రిమార్క్స్ అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయా..? లేదా..? చూడాల్సిన బాధ్యత ఎంఈవోలదే. అయినా చాలా చోట్ల ఎంఈవోలు బోగస్ వివరాలు సమర్పిస్తున్నారు. సందర్శనకు వెళ్లినప్పుడు పాఠశాలల్లో పారిశుధ్యం.. ఆహార ధాన్యాలు, పప్పు, ఇతర పదార్థాల నిల్వ, నాణ్యత ను పరిశీలించాల్సిన అధికారులు వాటిపై దృష్టి పెట్టడం లేదు. పాఠశాలల్లో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకును బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయించడం.. వంట వండే ముందు, తర్వాత వంట పాత్రలు శుభ్రంగా కడుగుతున్నారా...? లేదా..? అని చూడాల్సిన హెచ్‌ఎంలు తమ బాధ్యతను విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top