బైక్ డిక్కీలోని రూ.7.7 లక్షలు చోరీ

బైక్ డిక్కీలోని రూ.7.7 లక్షలు చోరీ - Sakshi


చైతన్యపురి: బైక్ డిక్కీలోని నగదు చోరీకి గురైన ఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... మోహన్‌నగర్ నివాసి బాలరాజు ఇబ్రహీంపట్నం ఉప్పరిగూడలోని శ్రీశ్రీనివాస రైస్ ఇండస్ట్రీలో కలెక్షన్ గుమస్తా.  కర్మన్‌ఘాట్‌లోని కార్యాలయం నుంచి అతను శుక్రవారం మధ్యాహ్నం చైతన్యపురికి బైక్‌పై వెళ్లాడు. డీసీబీ బ్యాంక్ రూ. 80 వేలు డ్రా చేశాడు.



అక్కడ నుంచి దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి సమీపంలోని కెనరా బ్యాంక్‌కు వచ్చి  రూ.7.77 లక్షలు డ్రా చేసి బైక్ డిక్కీలోని బ్యాగ్‌లో పెట్టాడు. అక్కడి నుంచి చైతన్యపురి రామాలయం సమీపంలోని శ్రీనవ్య కిరాణా జనరల్‌స్టోర్‌కు కలెక్షన్ కోసం వెళ్లాడు. దుకాణం ముందు బైక్ పార్కు చేసి లోపలికి వెళ్లి ఐదు నిమిషాల్లో బయటకు రాగా బైక్ డిక్కీ తెరిచి ఉంది. అందులో పెట్టిన రూ.7.77 లక్షల నగదు  బ్యాగ్ కనిపించలేదు.



ఈ విషయాన్ని వెంటనే రైస్ మిల్ యజమానితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  చైతన్యపురి సీఐ రవీందర్‌రెడ్డి, డీఎస్సై లక్షణ్ ఘటనా స్థలానికి వెళ్లి  బాలరాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలరాజు బ్యాంక్‌లో డబ్బు డ్రా చేస్తుండగా దుండగులు గమనించి, తర్వాత అతడి బైక్‌ను అనుసరించి ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

మాటల్లో పెట్టి...



బాలరాజు బైక్ పార్కు చేసి కిరాణా దుకాణంలోకి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మంచినీటి బాటిల్ కావాలని అడిగాడు.  బాటిల్ డబ్బులు షాపు యజమానికి అందించమని బాలరాజుకు ఇచ్చాడు. ఆ డబ్బు షాపు యజమానికి ఇచ్చేలోపే మరో వ్యక్తి బైక్‌లోని నగదు చోరీ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం అవుతోంది. బాలరాజు బ్యాంక్‌లో డబ్బు డ్రా చేస్తున్నప్పుడు అతడిని ఎవరైనా అనుసరించారా? అనేది తెలుసుకొనేందుకు బ్యాంక్‌లోని సీసీ కెమెరాలోని పుటేజీని తెప్పించి పరిశీలిస్తామని సీఐ రవీందర్‌రెడ్డి తెలిపారు.

 

బాలరాజుపై అనుమానాలు...



డబ్బులు డ్రా చేసుకురమ్మని బ్యాంక్‌కు పంపిస్తే బాలరాజు కలెక్షన్ కోసం వెళ్లడం పై రైస్‌మిల్ యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  దీంతో నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారా? లేక బాలరాజే డబ్బు మాయం చేసి చోరీ నాటకం ఆడుతున్నాడా అనే కోణంలో నూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top