బిగుస్తున్న ఉచ్చు


టవర్‌సర్కిల్:

 కరీంనగర్ కార్పొరేషన్‌లో శానిటేషన్ టెండర్లలో గోల్‌మాల్‌పై ‘‘ఐఏ‘ఎస్’ అంటే నిబంధనలు తూచ్’’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనం బల్దియాను కుదిపేస్తోంది. శ్రీరాజరాజేశ్వర సంస్థకు అర్హతలు లేకున్నా రూ.10 కోట్ల విలువైన పారిశుధ్య టెండర్లు కట్టబెట్టారని, కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు నిబంధనలు ఉల్లంఘించారనే విషయాన్ని వెల్లడిస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో అధికారుల్లో వణుకు మొదలైంది.



ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ఏకంగా హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు వెళ్లడం, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సీరియస్ అయ్యి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. తాజాగా మేయర్ రవీందర్‌సింగ్ వ్యాఖ్యలు కూడా అక్రమాలు జరిగినట్లు తేల్చడం... బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అక్రమాలతో సంబంధమున్న అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి.



నగరపాలక సంస్థ అభాసుపాలు కాకుండా ఉండేందుకు పాలకవర్గం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించడంతో బాధ్యులుగా తేలిన వారికి సరెండర్ తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. మూడు రోజులుగా టెండర్ల వ్యవహారం రచ్చరచ్చ అవుతుండడంతో ఈ అంశం నుంచి బయటపడేందుకు అడ్డంగా ఇరు క్కున్న అధికారులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. టెండర్లను రద్దు చేస్తే సమస్య సమసి పోతుందని మొదట భావించినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో రాజీయత్నాలు దిగారు.



ఈ వ్యవహారంతా గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేద్దామని ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడం, బయటపడేందుకు దారులన్నీ మూసుకుపోవడం తో అధికారులు పడరానిపాట్లు పడుతున్నట్లు తెలుస్తోం ది. టెండర్ల అంశం ఏకంగా కమిషన్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)కి వెలుతుండడంతో చేసిన తప్పిదాలు బయటపడడం ఖాయంగా కనిపిస్తోంది. డీఎంఏ, ఈఎన్‌సీ నుంచి కూడా వివరణ అడుగుతుం డడంతో తప్పించుకునే మార్గాలు అన్ని వైపులా మూసుకుపోయాయి. దీంతో బాధ్యులైన అధి కారులపై వేటు పడడం ఖాయమనే సంకేతాలు కనబడుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top