ఆర్టీసీ ఖజానాకు అద్దె బస్సుల కన్నం


  • ఐదేళ్లు దాటిన బస్సులకు అద్దె తగ్గించి చెల్లించే నిబంధనకు నీళ్లు

  • అక్రమంగా అదనపు చెల్లింపులు

  • వరంగల్ జిల్లాలో ఒకే డిపోలో రూ.10 లక్షలకు పైగా స్వాహ.. ప్రధాన కార్యాలయం టెస్‌ఆడిట్‌లో వెలుగులోకి

  • సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఖజానాకు చేరాల్సిన డబ్బులను అద్దె బస్సులు మింగేస్తున్నాయి. ఆ బస్సులకు అందాల్సిన అసలు అద్దె అందినా, అక్రమంగా మరింత మొత్తాన్ని పొందుతున్నాయి.  నయా పైసా కూడా స్వాహా కాకుండా ఆర్టీసీలో అంచెలవారీ నిఘా వ్యవస్థ ఉన్నా పైసలకు కాళ్లొస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ ఉదంతం చూసి ఆర్టీసీ ఉన్నతాధికారులే షాక్‌కు గురయ్యాయి. వెంటనే అప్రమత్తమై అలాంటి ఘటనలు ఇంకెక్కడైనా జరిగాయేమో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బస్సుల నిండా జనం ఉన్నా ఆర్టీసీకి నష్టాలు వస్తుండడం సామాన్యులకు అంతుచిక్కడం లేదు. ప్రపంచంలో మరే రవాణా సంస్థకు లేనన్ని బస్సులు నడుపుతున్న ఆర్టీసీ నష్టాలు ఊబిలో నిండా మునగడానికి ఇలాంటి ఉదంతాలు కూడా కారణమవుతున్నాయని స్పష్టమవుతోంది.

    ఇదీ సంగతి...

    ఆర్టీసీ తన అవసరాలకు తగ్గట్టుగా బస్సులు కొనే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని తిప్పుతోంది. ప్రస్తుతం 1200కు పైగా బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంది. పక్షం రోజులకోసారి ఈ బస్సులకు బిల్లులు చెల్లిస్తోంది.  ప్రతి బస్సు కండిషన్‌గా ఉండడం అత్యంత ముఖ్యం. ఇందుకోసం వరుసగా ఐదేళ్లపాటు తిరిగిన బస్సును ఆ తర్వాత కూడా కొనసాగించాల్సి వస్తే దాన్ని బాడీ సహా పూర్తిస్థాయిలో మార్చాల్సి ఉంటుందని ఆర్టీసీ నిబంధన విధించింది. ఆ బస్సుకు అప్పటివరకు చెల్లిస్తున్న అద్దె కూడా తగ్గిస్తారు. అది తిరిగే దూరాన్ని బట్టే అద్దె నిర్దారిస్తారు. ఐదేళ్ల తర్వాత కొనసాగే బస్సుకు... ఒప్పందంలో పేర్కొన్న మొత్తం కంటే కిలోమీటరుకు 99 పైసలు చొప్పున తగ్గించి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే మతలబు చోటుచేసుకుంటోంది. ఈ నిబంధనను తుంగలో తొక్కి ఐదేళ్లు నడిచిన బస్సుకు కూడా పూర్తి అద్దె చెల్లిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా తొర్రూరు డిపో పరిధిలో ఈ భాగోతం వెలుగు చూసింది. ఐదేళ్ల గడువు తీరిన కొన్ని బస్సులకు మొత్తం అద్దె చెల్లించినట్టు తేలింది. ఇవ్వాల్సిన మొత్తం కంటే దాదాపు రూ.10.86 లక్షల మేర అదనంగా చెల్లించారు.  హైదరాబాద్ బస్‌భవన్‌లో ఉండే ఆర్టీసీ టెస్ట్ ఆడిట్ విభాగం ఈ విషయాన్ని గుర్తించింది. పది బస్సులకు సంబంధించి అదనంగా చెల్లింపులు జరిగినట్టు తేలడంతో గతుక్కుమన్న ఆ డిపో అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆ బస్సు యజమానులను పిలిపించి... అదనంగా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. దీంతో ఇలాంటి వ్యవహారాలు మిగతా జిల్లాల్లో కూడా జరిగి ఉంటాయని అనుమానిస్తున్న ఉన్నతాధికారులు వెంటనే కేంద్ర ఆడిట్ విభాగాన్ని రంగంలోకి దించారు. తొలుత వరంగల్ జిల్లాలోని అన్ని డిపోల్లో సోదాలు చేస్తున్నారు.



    తీవ్రంగా పరిగణిస్తున్నాం

    అద్దె బస్సులకు అక్రమంగా బిల్లులు చెల్లించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. వరంగల్ జిల్లా తొర్రూరు డిపో ఉదంతంలో  సిబ్బంది తీవ్రమైన నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది. నిఘా వ్యవస్థ ఉండికూడా రూ.లక్షలు దారిమళ్లడం ఆశ్చర్యంగా ఉంది. దీనిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు ఇంకెక్కడైనా జరిగాయేమో తెలుసుకునేందుకు మా టెస్ ఆడిట్ విభాగం రంగంలోకి దిగింది.

     రమణరావు, జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్, టీఎస్‌ఆర్టీసీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top